తెలుగు సినీ చరిత్రలో నాగిరెడ్డి - చక్రపాణి, బాపు-రమణ వంటి వారి స్నేహాలు, వారి మద్య ఉండే అనుబంధం ఎంతో గొప్పది, ఇక కెవి మహదేవన్‌కి సహాయకుడైన పుహళేంది నాడు సొంతగా తనకి ఎన్నోచాన్స్‌లు వచ్చినా నా పయనం మహదేవన్‌గారితోనే అని చెప్పాడు. సినిమా అనేది టీం వర్క్. ఇక్కడ విడిపోతే పడిపోతారు. ఎవరైతే.. మా వల్లే సినిమాలు అడుతున్నాయనే భ్రమలో ఉంటారో వారికి ఎదురు దెబ్బలు తప్పవు. రాజ్-కోటి, శ్రీనువైట్ల - కోన వెంకట్, త్రివిక్రమ్ - విజయభాస్కర్ నుంచి ఎందరో దీనికి ఉదాహరణగా నిలుస్తారు.
కుర్రారంగారావు వెళ్లిపోయిన తర్వాత ఎస్వీకృష్ణారెడ్డి, తన సహాయకులు డైరెక్టర్లుగా మారిన తర్వాత పూరీ పరిస్థితి అదే. ఇక త్రివిక్రమ్‌కి దేవిశ్రీప్రసాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. త్రివిక్రమ్ కోరుకునే అవుట్‌పుట్ ఇవ్వడంలో దేవిశ్రీ 100శాతం మార్కులు సాధిస్తారు. ఇక దర్శకునిగా త్రివిక్రమ్ మారిన తర్వాత ఏవో ఒకటి రెండు చిత్రాలకు తప్పించి దేవిశ్రీతో ఆయన కలిసి నడిచిన 'జల్సా, అత్తారింటికిదారేది, జులాయి' ఇలా మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్ వచ్చాయి. కానీ ఏమి కారణమో తెలియదు గానీ త్రివిక్రమ్ తన 'అ..ఆ' చిత్రం కోసం అనిరుద్‌ని తెచ్చాడు. కానీ ఆయన మద్యలో వైదొలడంతో మిక్కీ జె మేయర్‌తో సర్దుకున్నాడు.
ఇక 'అజ్ఞాతవాసి'కి మరలా అనిరుధ్‌ని తీసుకున్నాడు. అనిరుధ్ మంచి టాలెంటెడ్ సంగీత దర్శకుడే. కాదని ఎవ్వరూ అనలేరు. కానీ తెలుగునేటివిటీ, తెలుగు శ్రోతల అభిరుచికి తగ్గ సంగీతం అందించడంలో ఆయన సక్సెస్ కాలేదు. దేవిశ్రీ చేసే మ్యాజిక్ చేయలేకపోయాడు. ఇక త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఎన్టీఆర్‌తో. ఈ చిత్రంలో కూడా తానే పనిచేస్తున్నానని అనిరుధ్ ప్రకటించాడు. సాంకేతిక నిపుణుల్లో కూడా ఈ చిత్రం కోసం ఫైనల్ అయింది అనిరుధే. కానీ ఆయనను తప్పించి మరోసారి త్రివిక్రమ్ చేతనే ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించేలా ఎన్టీఆర్ ఒప్పించాడు. దీని ద్వారా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కాస్త రిలాక్స్ కావచ్చు.