‘అజ్ఞాతవాసి’ సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. దక్షిణాది సినీ చరిత్రలోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాగా ‘అజ్ఞాతవాసి’ రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్ దాదాపు పూర్తయింది. ఈ సినిమా రైట్స్ ఏకంగా రూ.127 కోట్లకు అమ్మారు నిర్మాతలు. కనీసం సగం అంటే 60 కోట్ల షేర్ మార్కును అందుకుంటుందా అంటే అది కూడా కష్టంగానే వుంది.
ప్రస్తుతానికి షేర్ రూ.58 కోట్లు మాత్రమే. అంటే దాదాపు రూ.70 కోట్ల నష్టమన్నమాట. ఇంతటి నష్టం వున్న సినిమా టాలీవుడ్ లో ఇదే. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన ఘనత ‘బాంబే వెల్వెట్’దే. ఆ చిత్రం దాదాపు రూ.100 కోట్లకు బయ్యర్లను ముంచినట్లు అంచనా. మళ్లీ అదే స్థాయిలో నష్టాలు తెచ్చిన చిత్రం 'అజ్ఞాతవాసి'.
‘అత్తారింటికి దారేది’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబినేషన్లో వచ్చిన సినిమా ఈ స్థాయిలో నష్టాలు తెచ్చిపెట్టడం ఊహించలేనిది. కానీ ‘అజ్ఞాతవాసి’ చిత్రం తొలి రోజే 40 కోట్ల షేర్ వచ్చింది. ఆ తర్వాత ఇన్ని రోజుల్లో కలిపి ‘అజ్ఞాతవాసి’ వసూలు చేసింది రూ.18 కోట్లు మాత్రమే. అయితే ఈ సినిమాను కొని నిండా మునిగిన బయ్యర్లకు సెటిల్మెంట్ చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.