సాదారణంగా పెళ్లిళ్లయితే హీరోయిన్లకు సినిమా ఛాన్స్‌లు తగ్గుతుంటాయి. కానీ అక్కినేని నాగార్జున పెద్దకోడలు సమంత విషయంలో ఇది రివర్స్‌లో జరుగుతోంది. పెళ్లయిన తర్వాతనే ఆమెకి నటనకు స్కోప్ ఉన్న మంచి పాత్రలు లభిస్తున్నాయి. ఆల్‌రెడీ 'రాజుగారి గది 2'లో కీలకమైన పాత్రను పోషించి మెప్పించింది. ఇక ఈమె 'రంగస్థలం'లో కూడా డీగ్లామర్ పాత్రలో నటనకు ఎంతో స్కోప్ ఉన్న పాత్రను చేస్తోంది. 'మహానటి'లో జమున క్యారెక్టర్‌లో నటిస్తోంది. ఇక ఈమె తమిళంలో విశాల్ హీరోగా రూపొందుతున్న 'అభిమన్యుడు' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్‌చరణ్-సుకుమార్‌ల 'రంగస్థలం 1985' మార్చి 30న విడుదల కానుంది. ఇక విశాల్‌తో నటిస్తున్న 'అభిమన్యుడు' చిత్రం రేపు విడుదల కావాల్సి ఉండగా, మార్చికి వాయిదా పడింది. మరోవైపు మార్చి 29న వస్తానన్న 'మహానటి' కూడా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి రెండు మూడు నెలలోపే ఈ చిత్రాలన్ని విడుదలకు సిద్దం అవుతున్నాయి.
ఇక తాజాగా సమంత కన్నడలో సెన్సేషనల్ హిట్ అయిన 'యూటర్న్' చిత్రాన్ని నిర్మాణ భాగస్వామిగా తెలుగు, తమిళ భాషల్లో ప్రధాన పాత్రను తానే పోషిస్తూ రీమేక్ చేయనుంది. ఈ చిత్రానికి 'యూటర్న్' ఒరిజినల్ కన్నడ వెర్షన్ దర్శకుడు పవన్‌కుమారే దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఇది ఇంతవరకు సమంత చేయని పాత్ర. ఆమెకి ఇది ఓ డిఫరెంట్ చిత్రం అవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ చిత్రం కన్నడ వెర్షన్‌లో శ్రద్దాశ్రీనాధ్, రాధికా చేతన్, దిలీప్‌రాజ్‌లు ముఖ్యపాత్రలు పోషించారు. మరి తెలుగు, తమిళంలో సమంత కాకుండా మిగిలిన పాత్రలు ఎవరు నటించనున్నారో తెలియాల్సివుంది.
ఇక ఆ 'యూటర్న్' వద్ద డివైడర్‌ని తొలగించి మరీ 'యూటర్న్' తీసుకున్నవారు ప్రాణాలతో బతకరు. ఎవరు కాపాడాలని చూసినా, తప్పించుకోవాలని చూసినా కూడా లాభం లేదు. మృత్యువాత పడతారు. అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కథాశంతో ఈ చిత్రం రూపొందనుంది. మొత్తానికి ప్రస్తుతం 'కిర్రాక్ పార్టీ' తర్వాత తెలుగులో రీమేక్ కానున్న మరో కన్నడ చిత్రం ఈ 'యూటర్న్'అని చెప్పాలి.