'పదహరేళ్ల వయసు.. పడి పడి లేచే మనసు' అనే చిత్రం చిరంజీవి వందో చిత్రంగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఏకైక చిత్రం 'లంకేశ్వరుడు'లోని పాట. ఇందులోని పడి పడిలేచె మనసు అనే పదాల టైటిల్‌తో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి ఈటైటిల్ ఖరారైపోయినట్లేనని అంటున్నారు. ఇక ఈ చిత్రం దర్శకుడు హనురాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందుతోంది. తెలుగులో ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్‌లో హనురాఘవపూడి ఒకరు అని చెప్పాలి.
'అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, లై' చిత్రాల ద్వారా ఈయన తన సత్తా చాటాడు. నితిన్‌తో చేసిన 'లై' చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ ఎంచుకున్న వైవిధ్యభరితమైన కథకి దర్శకునిగా హను రాఘవపూడి తగిన న్యాయమే చేశాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే ఈ ప్రయోగం బెడిసి కొట్టడంతో కమర్షియల్ డైరెక్టర్‌గా తనని తాను ప్రూవ్ చేసుకోవాలంటే శర్వానంద్ చిత్రం ఆయనకు ఎంతో కీలకమనే చెప్పాలి. మరోవైపు శర్వానంద్ కూడా ప్రతి చిత్రాన్ని విభిన్నంగా ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు.
నాని, నిఖిల్‌ల తరహాలోనే శర్వానంద్ వైవిధ్యమైన చిత్రాలకే ఓకే చెబుతున్నాడు. దాంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇది ఎలాంటి ప్రయోగాలకు తావు లేని క్లీన్ రొమాంటిక్ లవ్‌స్టోరీ అని తెలుస్తోంది. ట్రీట్‌మెంట్ మాత్రం హను స్టైల్‌లోనే వైవిధ్యంగా ఉంటుందిట. ఇక ఇందులో శర్వానంద్‌కి జోడీగా నటించే హీరోయిన్‌తో పాటు నటీనటుల ఎంపిక, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకోవాల్సివుంది. కథతో పాటు టైటిల్ కూడా శర్వానంద్‌కి బాగా నచ్చిందని అంటున్నారు. ఇక గతంలో శర్వానంద్ చిరంజీవి పాటలోని 'మళ్లీమళ్లీ ఇది రాని రోజు' టైటిల్‌తో ఓ చిత్రంచేసి సక్సెస్‌ని, ప్రశంసలను అందుకున్నాడు.