తాజాగా అల్లుఅర్జున్ నటిస్తున్న 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. మరో నెలరోజుల్లోపే షూటింగ్ పూర్తి అవుతుందని నిర్మాత లగడపాటి శ్రీదర్ అంటున్నాడు. ఈ చిత్రం గురించి కంటే ఆయన ఎక్కువగా బన్నీని ఆకాశానికి ఎత్తేలా పొగడ్తల వర్షం కురిపించాడు. బన్నీని చూస్తే ఇండియన్ మైఖైల్ జాక్సన్ అంటే ఇతనే అనిపిస్తోందన్నాడు. ఇక ఈ చిత్రం ద్వారా రచయిత వక్కంతం వంశీ దర్శకునిగా మారుతున్న సంగతి తెలిసిందే.
రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి లగడపాటి శ్రీధర్ నిర్మాత కాగా, నాగబాబు సమర్పకునిగా, బన్నీవాసు కోప్రోడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. దేశభక్తి కంటెంట్ నిండిన చిత్రం కావడంతో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ చిత్రంలోని 'ఇల్లే ఇండియా,.. దిల్లే ఇండియా... నీతల్లే ఇండియా' అనే రామజోగయ్య శాస్త్రి రాసిన దేశభక్తి గీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ పాట వింటే ఒళ్లు దేశభక్తితో పులకరిస్తుందట. ఇక ఈచిత్రంలో రామజోగయ్య శాస్త్రి ఏకంగా నాలుగు పాటలన రాశారు. వక్కంతం వంశీ రచయితగా పనిచేసిన చిత్రాలన్ని బ్లాక్‌బస్టర్స్ అయ్యాయని, ఈ చిత్రం ద్వారా దర్శకునిగా కూడా వక్కంతం వంశీ బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయమని రామజోగయ్య శాస్త్రి అంటున్నారు.
ఇక ఈ చిత్రంలోని మరో రొమాంటిక్ సాంగ్‌ని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. మొత్తంగా మార్చి నాటికి చిత్రంలోని పాటలన్నింటినీ రిలీజ్ చేసి ఏప్రిల్ 27న విడుదల చేస్తామని యూనిట్ అంటోంది. మరోవైపు ఈ చిత్రానికి విశాల్-శేఖర్ అందించిన సంగీతం, అను ఇమ్మాన్యుయేల్ అందాలు, మంచి మంచి లోకేషన్లు కూడా ప్లస్ పాయింట్‌గా నిలుస్తాయట. బన్నీ ఇందులో దేశంకోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడని ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. భరత మాతకు సైనికులు వందనం చేస్తారు. మరి సైనికులకు వందనం చేసేలా 26న విడుదల చేసే దేశభక్తి గీతం ఉంటుందని యూనిట్ చెబుతోంది.
దాంతో ఈ యూనిట్ అందరు తాజాగా విడుదల చేయబోయే సాంగ్‌ని 'సైనిక్' సాంగ్ అని పిలుస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇంటర్వెల్ బ్యాంగ్‌కి సంబంధించిన యాక్షన్ సీన్స్ చిత్రీకరణ ఫైట్ మాస్టర్ పీటర్‌హెయిన్స్ కొరియోగ్రఫీలో తెరకెక్కుతున్నాయి ఈ ఫైట్స్‌ని చూస్తే సాంగ్స్ టీజర్స్‌ని రిలీజ్ చేసినట్లుగా ఫైట్స్ టీజర్స్‌ని కూడా విడుదల చేస్తే ఎలా ఉంటుందా? అని యూనిట్ భావిస్తోంది. ఇక ఈచిత్రాన్ని తెలుగు, మలయాళం, హిందీ భాషలతో పాటు తమిళం, మరాఠి, భోజ్‌పురి వంటి ఏడు భాషల్లో ఒకేరోజున రిలీజ్ చేయనున్నారని సమాచారం.