పవన్‌కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామి సాక్షిగా తన రాజకీయ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సకల జనుల సర్వే సమయంలో పవన్‌ని ఓ టూరిస్ట్‌గా పేర్కొన్న కేసీఆర్ పవన్‌కి రాజకీయ యాత్ర చేసేందుకు ఎలా? ఎందుకు వీసా జారీ చేశారు? పవన్‌కళ్యాణ్ వంటి టూరిస్ట్ నేతకి ఇచ్చిన వీసా తెలంగాణ ఉద్యమనేతలకు, తెలంగాణ కోసం పోరాడిన జేఏసీ నాయకులకు ఇవ్వక పోవడం దారుణమని అన్నారు. ఉద్యమనాయకులు, జేఏసీ వారికి కూడా ఇలాంటి వీసాలు ఇస్తే తాము ఇంకా తెలంగాణలోనే ఉన్నామన్న నమ్మకం వారికి వస్తుంది. జేఏసీ నేతలను నిర్బంధించిన తీరు చూస్తుంటే తెలంగాణ బిడ్డలు పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధమవుతుందని విజయశాంతి వ్యాఖ్యానించారు.
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలోని పేరున్న మేధావి, జర్నలిజం ప్రొఫెసర్, మాజీ ఎమ్మెల్సీ, నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రోఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ, పవన్ నిన్నటివరకు లాబీయింగ్ పనులు చేశారు. ఏదైనా సమస్యను గుర్తించి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లే పరిష్కారం చేస్తున్నారని నాగేశ్వర్ వ్యాఖ్యానించాడు. అయితే నాగేశ్వర్ వాడిన లాబీయింగ్ అనే పదంపై పవన్ అభిమాని అభ్యంతరం వ్యక్తం చేశాడు. దానిని నాగేశ్వర్‌రావు బదులిస్తూ పవన్ అభిమానులు ఈ ఆవేశం ఆపుకుంటే జనసేన బాగుపడుతుంది. పవన్‌పై దోమ వాలితే అణుబాంబులు వేసి చంపుతాం. ఈగ వాలితే రివాల్వర్ దాకా పేల్చుతాం అనే పద్దతి వల్ల పవన్‌కి నష్టమే తప్ప తనకేమీ నష్టం లేదు. నాకు పోయేది ఏమీ లేదు. అయినా లాబీయింగ్ అంటే పవన్ అభిమానులకు తెలియనట్లుంది. అమెరికాలో లాబీయిస్టులు అనే ఓ వృత్తి కూడా ఉంది.
పవన్ రెండు రాష్ట్రాలలో తనకున్న బలం తనకు తెలియదని అంటున్నాడని, అలాంటి సమయంలో పవన్‌కి ఎంత బలముందో నేనేమి చెప్పగలను? పార్టీలు లాబీయింగ్‌ల కంటే రాజకీయంగానే బలంగా తయారవుతాయి. లాబీయింగ్ అనేది స్వచ్చంద సంస్థలు, రాజకీయాల ప్రమేయం లేని వారు చేసే పని. సమస్యలను కేవలం కేసీఆర్, చంద్రబాబుల దృష్టికి తీసుకుపోవడానికే అయితే ఆయనపార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఎందరో అభిమానులున్న స్టార్. ఆయనకు ఏదైనా సమస్య తెలిస్తే దానికి ఆయన సీఎంలను కలవడానికి ఈజీగానే వీలవుతుంది. తద్వారా వారి దృష్టికి సమస్యలను తీసుకెళ్లే చరిష్మా పవన్‌కి ఉంది. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ కార్యాచరణ ముఖ్యమని పవన్ గ్రహించాలి అని ఘాటుగానే సమాధానం ఇచ్చాడు.