పవన్‌కళ్యాణ్ తన జనసేన తరపున జగిత్యాల జిల్లా ఆంజనేయస్వామి ఉన్న కొండగట్టు నుంచి తన 'ఛలోరే ఛలోరే చల్' ద్వారా ప్రజాయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాను ఈ నెల 27 నుంచి అనంతపురం నుంచి తన యాత్రను ప్రారంభిస్తానని ప్రకటించాడు. మరోవైపు తాను తెలంగాణ, ఆంధ్రా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ బలం ఉన్న స్థానాలలో పోటీ చేస్తానని, ఏయే చోట్ల పోటీ చేస్తామనే సంగతి ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే తెలియజేస్తానని పవన్ ప్రకటించాడు. ఈ విషయంలో ఇప్పటికే మేధావులు, సీనియర్ జర్నలిస్ట్ సలహాలను తీసుకుంటున్నామని చెప్పాడు. గత ఎన్నికల్లో సదుద్ధేశ్యంతోనే బిజెపి, టిడిపికి మద్దతు తెలిపానని, రాబోయే రెండు రోజులు కార్యకర్తలతో సమావేశమవుతానని ఆయన ప్రకటించాడు. ముందుగా సినీ జోష్ చెప్పినట్టే ఆయన ఇక సినిమాలలో నటించేది లేదంటూ చెప్పడం ఆయన అభిమానులకు మింగుడు పడని విషయం.
మరోవైపు తన జనసేనకి తన అన్నయ్య చిరంజీవికి సంబంధం లేదని, తనకు రాజకీయంగా తన కుటుంబసభ్యుల మద్దతు లేదని ప్రకటించాడు. కానీ పవన్ అలా అన్నాడో లేదో చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ 'నేను ఓ భారతీయుడిని, నా జన్మభూమిని రక్షించుకునే బాధ్యత నాకు ఉంది అని పవన్ బాబాయ్ చేపట్టిన ఈ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నా...జై జనసేన' అని చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. మరోవైపు పరుచూరి గోపాలకృష్ణ స్పందిస్తూ తరం తరం నిరంతరం సమస్యల వలయంలో చిక్కుకుంటున్న ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పవన్ చేపట్టిన ప్రజా యాత్ర ప్రభంజన యాత్రగా మారి, ప్రజలకు హితం చేకూరాలని కోరుకుంటున్నా.. జనసేనానికి శుభాకాంక్షలు. విజయీభవ అని పరుచూరి స్పందించారు.