వర్మ ప్రియశిష్యుల్లో పూరీజగన్నాథ్ పేరును ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎవరిపైన అయినా సెటైర్లు వేస్తాడేగానీ పూరీపై ఈగ వాలినా వర్మ ఒప్పుకోడు. అమితాబ్‌బచ్చన్‌ని ఒప్పించి, 'బుడ్డా హోగా తేరా బాప్' అవకాశం కూడా వర్మనే ఇప్పించాడు. ఇక డ్రగ్స్ విషయంలో పూరీ కూడా ఉండటంతో అధికారులపై వర్మ నానా విధాలుగా విరుచుకుపడ్డాడు. 'పైసా వసూల్' స్టెంపర్‌ని చూసి అద్భుతం, హాలీవుడ్ రేంజ్‌లో ఉందంటూ పొగిడేశాడు.
ఇక తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన కుమారుడు ఆకాష్‌పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' చిత్రంలోని కొన్ని సీన్స్‌ని వర్మ చూశాడట. చూసిన వెంటనే 'మెహబూబా' చిత్రాన్ని ఏకంగా మహేష్-పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'పోకిరి' చిత్రంతో పోల్చాడు. 'మెహబూబా'తో పోలిస్తే 'పోకిరి' అట్టర్‌ఫ్లాప్ చిత్రమని తేల్చేసి పూరీని ఆకాశానికి ఎత్తేశాడు. పూరీ తన కుమారుడిపై ఉన్న ప్రేమతో 'మెహబూబా'ని అద్భుతంగా తీర్చిదిద్దాడని, ఓ అందమైన దృశ్యకావ్యంగా మలిచాడని ట్వీట్‌చేశాడు.
దీనికి స్పందించిన పూరీ తన ట్వీట్ ద్వారా 'తొలిసారి మా బాస్ నన్నుఓ ఫిల్మ్‌మేకర్‌గా గుర్తించారు. నా జీవితంలో ఇదో పెద్ద కాంప్లిమెంట్. లవ్ యు సార్' అని అన్నాడు. ఇక ఇండో పాక్ వార్ నేపధ్యంలో పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతోన్న 'మెహబూబా' చిత్రం దేశంలోని పలు ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటోంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, కులుమనాలి వంటి చోట్ల మంచుకొండల్లో చిత్రీకరిస్తున్నారు. మరి ఈ చిత్రం పూరీకి, ఆయన కుమారుడికి మెమరబుల్ హిట్‌నిస్తుందేమో చూడాలి. ఇక ఇటీవల 'అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తదుపరి చిత్రం కథ విని దీని ముందు 'అర్జున్‌రెడ్డి' చిత్రం కూడా ఫ్లాప్ అనిపిస్తుందని వర్మ చేసిన కామెంట్ తెలిసిందే. ఇలా ఏదో చిత్రంతో బయటి చిత్రాలను కంపేర్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వర్మకి అలవాటే....!