స్టార్ హీరో సూర్యని సన్‌టివి యాంకర్లు ఎగతాళిగా మాట్లాడటం ప్రస్తుతం తమిళనాట సంచలనంగా మారుతోంది. సూర్య.. అనుష్కతో హీల్స్ వేసి నటించాడని, త్వరలో అమితాబ్‌తో స్టూల్‌ఎక్కి నటిస్తారా? అని సన్‌టీవీ యాంకర్లు సూర్య హైట్ గురించి కామెంట్స్ చేయడంతో సన్‌టీవీపై చర్యలు తీసుకోవాలని, వారు సూర్యకి సారీ చెప్పందే పోరాటం ఆగదని దక్షిణభారత నటీనటుల సంఘం డిమాండ్ చేస్తోంది. సన్ టీవీ యాంకర్ల ధోరణిని విశాల్‌తోపాటు జ్ఞానవేల్‌రాజా, 'గ్యాంగ్' సినిమా దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో పాటు అందరు ఖండిస్తున్నారు. జోక్‌లు, సెటైర్లు వేయడానికి మీకు సినిమా వారే దొరికారా? అనే ఆగ్రహం అంతటా వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో సూర్య మౌనంగా ఉన్నా ఆయన అభిమానులు మాత్రం కోపంతో రగిలిపోతున్నారు.
తాజాగా సూర్య విషయంలో తమిళ సీనియర్ నటి ఖుష్బూ కూడా స్పందించింది. సుందర్ సికి భార్యగానే గాక రాజకీయ నాయకురాలైన ఆమె ఎవరు పొట్టిగా ఉంటే వారికెందుకు? ఎవరు పొడవుగా ఉంటే వారికెందుకు? ఎవరు లావైతే వీరికేమీ? ఎవరు సన్నగా ఉంటే వీరికేమిటి? అనవసరంగా నోరు జారారు ఇలాంటి వ్యాఖ్యల వల్ల వారు సాధించేది ఏమిటి? ఈ విషయాన్ని కూడా తమ టీఆర్పీ రేటింగ్స్ కోసం వాడుకుంటున్నారు. అందరి మీద చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు. సూర్య గురించి మాట్లాడిన వారు సిగ్గు పడాలి. ఇది అర్ధరహితమైన చర్చ. ఆ ఇద్దరు యాంకర్లు సూర్యకి క్షమాపణ చెప్పాలని ఖుష్బూ డిమాండ్ చేసింది. ఇదే అభిప్రాయం కోలీవుడ్ మొత్తం వ్యక్తం చేస్తుండటంతో ఆయా యాంకర్లు వారి తరపున సన్‌టీవీ క్షమాపణలు చెప్పక తప్పేలా లేదు.