ఇప్పటికే కోటశ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, చంద్రమోహన్ వంటి వారు ఇండస్ట్రీలో పెరుగుతున్న వారసత్వం, పరాయి భాషల నుంచి విలన్లను, సపోర్టింగ్ ఆర్టిస్టులను తెస్తుండటంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక బోయపాటి శ్రీను విషయానికి వస్తే 'లెజెండ్' ద్వారా జగపతిబాబు కెరీర్‌ని మరో మలుపు తిప్పాడు. ఇక 'సరైనోడు'తో ఆది పినిశెట్టికి క్రేజ్ తెప్పించాడు. కానీ ఆయన తన తర్వాతి చిత్రం 'జయజానకి నాయకా'లో శరత్‌కుమార్, వాణివిశ్వనాథ్, తరుణ్ అరోరా వంటి వారిని పెట్టుకున్నాడు. మరోవైపు తాజాగా ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో మరలా పరభాషా వారిపైనే దృష్టి నిలిపాడు. ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా 'రక్తచరిత్ర' ఫేమ్ వివేక్ ఓబేరాయ్‌ని తీసుకున్నాడు.
ఇక 'అజ్ఞాతవాసి' పాప భారాన్ని అను ఇమ్మానియేల్ పై వేసి 'భరత్ అనే నేను' అమ్మడు కైరా అద్వానీనీ తీసుకున్నాడు. ఇక ఈయన ఈ చిత్రంలోని మరో రెండు కీలక పాత్రలకు స్నేహ, తమిళ్ సీనియర్ హీరో ప్రశాంత్‌ని తీసుకోవడం గమనార్హం. ప్రశాంత్ ప్రముఖ తమిళ నటుడు త్యాగరాజన్ కుమారుడు. ఈయన గతంలో 'చామంతి, ప్రేమశిఖరం'వంటి చిత్రాలతోనే కాదు శంకర్ 'జీన్స్', మణిరత్నం 'దొంగా దొంగా' ద్వారా కూడా ఫేమస్. కానీ ఈయన కెరీర్ తమిళంలోనే ఫేడవుట్ అయింది. ఇలాంటి సమయంలో తన చిత్రంలో బోయపాటి.. ప్రశాంత్‌ని పెట్టుకునే బదులు మరో శ్రీకాంత్‌నో, లేక రాజశేఖర్‌నో పెట్టుకుంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక తనకు దేవిశ్రీప్రసాద్‌కి మనస్పర్దలు వచ్చినా మరలా 'జయజానకి నాయకా'లో పనిచేసిన దేవిశ్రీనే పెట్టుకోవడం తమన్‌కి తీవ్ర ఆశాభంగమేనని చెప్పాలి. ఎందుకంటే తమన్‌ని 'సైరా..' బదులు ఈ చిత్రంలో పెట్టుకుంటాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం తమన్ సంగీతం అందించిన 'తొలిప్రేమ, భాగమతి' చిత్రాలలోని సాంగ్స్ అందరినీ అలరిస్తున్నాయి. అయినా తమన్‌కి ప్లేస్ ఇవ్వకుండా దేవిశ్రీనే కంటిన్యూ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు 'సన్నాఫ్ సత్యమూర్తి' తర్వాత స్నేహ నటించే చిత్రం బోయపాటి-చరణ్‌లదే కావడం విశేషం.