మనదేశంలో తెలుగు స్టార్స్‌కి, దక్షిణాది చిత్రాలకు కేవలం 'బాహుబలి' తోనే గుర్తింపు వచ్చిందని పలువురు భుజాలు ఎగరేస్తున్నారు. 'బాహుబలి' చిత్రం మన సినిమా మార్కెట్ స్థాయిని పెంచిందనేది వాస్తవమే అయినా ఇంతకు ముందు కూడా అమితాబ్‌బచ్చన్ నుంచి రజనీకాంత్ వరకు, శ్రీదేవి నుంచి మాధురి దీక్షిత్ వరకు విదేశీ ప్రేక్షకులను అభిమానులను అలరించిన వారే. రజనీ నటించిన 'ముత్తు' చిత్రంలోని 'థిల్లానా థిల్లానా' సాంగ్‌తో రజనీ డ్యాన్స్ కింగ్ అయిపోయి జపాన్‌లో సైతం సంచలనం సృష్టించాడు. ఇక శ్రీదేవికి సింగపూర్ వంటి దేశాలలోని రెస్టారెంట్లలో ఆమె విగ్రహాలను పెట్టుకునేంత క్రేజ్ ఉంది. ఇక అమితాబ్‌కి విదేశాలలో ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఇక నాటి ఎన్టీఆర్, ఎస్వీఆర్‌లకూ విదేశాలలో మంచి గుర్తింపే ఉండేది. తాజాగా జపాన్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్‌కి సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. రాజకీయనాయకునిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు, సోషల్‌మీడియాలో భారీ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంటున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ని చూస్తే ఐటి మంత్రి అంటే ఇలాగే ఉండాలి అనిపించేలా పనిచేస్తున్నాడు. సోషల్‌మీడియా ద్వారా కూడా నిత్యం అందరితో టచ్‌లో ఉంటూ ఏ సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన జపాన్ పర్యటనలో ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశాడు.
జపాన్‌లోని షిజ్వోకా ప్రాంతంలోని హిమామట్సు అనే చిన్న ప్రాంతంలో ఉన్న సుజుకి మ్యూజియంని ఆయన సందర్శించారు. ఈ పర్యటన అద్భుతంగా ఉందని చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన అక్కడ నేను ఎవరి ఫొటోను చూశానో తెలుసా? అని ప్రశ్నిస్తూ, మన మెగాస్టార్ చిరంజీవి ఫొటోను ఇంత చిన్న పట్టణంలోని మ్యూజియంలో చూడటం... ఆయన మనవాడు కావడం ఎంతో ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించిందని తెలిపాడు. దీనిని బట్టి మనకి తెలియని పలు దేశాలలో కూడా చిరంజీవికి కూడా ఎంతో ఇమేజ్ ఉన్న సంగతిని రుజువులతో సహా కేటీఆర్ చిరంజీవి చిత్రపటంతో తాను తీసుకున్న ఫొటోని పోస్ట్ చేశాడు. దీనిని బట్టి మెగాస్టార్ ఇమేజ్ ఏమిటో మరోసారి స్పష్టమైంది...!