తెలుగు సినీ రంగంలో ఉన్న అతి ముఖ్యమైన నటుల్లో చంద్రమోహన్ ఒకరు. ఆయన కె.విశ్వనాథ్ వంటి దర్శకుని 'సిరిసిరిమువ్వ'లో, 'పదహారేళ్ల వయసు' వంటి చిత్రాలలో అంగవైకల్యం ఉన్న పాత్రలకు జీవం పోశాడు. ఇక జంధ్యాల, రేలంగి నరసింహారావు వంటి వారి చిత్రాలలో కామెడీ పాత్రలు అద్భుతంగా పోషించాడు. 'కలికాలం' వంటి అనేక చిత్రాలలో ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టించారు. ఈయన చేయని పాత్ర అంటూ ఏదీ లేదనే చెప్పాలి, నాటి ఎస్వీరంగారావు వంటి మహానటుడే నువ్వు కాస్త హైట్ ఉంటే ఎన్టీఆర్ ఏయన్నార్ వంటి వారితో పోటీపడే సత్తా నీలో ఉందని ప్రశంసించాడు.
ఇక తాజాగా చంద్రమోహన్ మాట్లాడుతూ, పరిశ్రమలో వారసుల హంగామా సాగుతోందని, వారికి తప్ప బయటి వారికి టాలెంట్ ఉన్నా వారిని పైకెదగనీయడం లేదన్నారు. వారసులతో ఇండస్ట్రీని నింపేస్తే భవిష్యత్తులో సిని పరిశ్రమ మనుగడకే ప్రమాదమని తేల్చాడు. మన వద్ద అద్భుతమైన నటులు ఉన్నా కూడా భాషా, నటన చేతకాని పరభాషా విలన్ల వెంటపడటం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక సినీ పరిశ్రమ వైజాగ్‌కి రావాల్సిన అవసరం లేదని, హైదరాబాద్‌లో అన్ని బాగున్నాయని కితాబునిచ్చాడు. ఇక వారసుల గురించి, పరభాషా విలన్ల గురించి ఇదే రకమైన అభిప్రాయాన్ని గతంలో కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ కూడా అభిప్రాయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇక తనకు రాజకీయాలంటే అసహ్యమని, తన తోటి స్నేహితులు, సహనటులు అయిన మురళీమోహన్, జయసుధ, జయప్రద, జయలలిత వంటి ఎందరో రాజకీయాలలో ఉన్నా కూడా తాను ఇప్పటివరకు ఎవ్వరికి మద్దతు ఇవ్వని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.