తమిళ సీనియర్ డైరెక్టర్లలో పి.వాసు ఒకరు. ఈయన నాటి స్వర్గీయ ఎన్టీఆర్‌తోచిత్రాలు నిర్మించి, ఎన్టీఆర్‌కి మేకప్‌మేన్‌గా, పనిచేసిన పీతాంబరం తనయుడు. ఇక ఈయన తమిళంలో రజనీకాంత్ నుంచి ప్రతి స్టార్‌కి చరిత్రలో నిలిచిపోయే చిత్రాలను అందించాడు. కానీ 'చంద్రముఖి' తర్వాత ఈయన గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ఇటీవల 'శివలింగ' అనే చిత్రాన్ని లారెన్స్ హీరోగా చేశాడు. ఇక ఈయన తెలుగులో కూడా శ్రీహరి హీరోగా ద్విపాత్రాభినయం పోషించిన 'పృథీనారాయణ, బాలకృష్ణ,లిజి జంటగా 'సాహసమే జీవితం'తో పాటు 'మహారధి' రజనీకాంత్, జగపతిబాబుల 'కథానాయకుడు', మంచు విష్ణు, నాగార్జునలతో 'కృష్ణార్జున', వెంకటేష్ తో 'నాగవల్లి' వంటి చిత్రాలకు కూడా దర్శకత్వం వహించాడు. ఈయన తమిళంలోనే గాక తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా దర్శకునిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈయన తాజాగా మరణించాడని సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి దాంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పి.వాసునే ఓ వీడియో ద్వారా తాను ఆరోగ్యంగా, హ్యాపీగా, కులాసాగా ఉన్నానని, తన అభిమానులెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పాడు. ఈ వార్తలు చూసి తాను నవ్వుకున్నానని, తాను ఈ ఏడాది మూడు చిత్రాలకు దర్వకత్వం వహించనున్నానని తెలిపాడు. ఇక గతంలో కూడా సుశీల నుంచి ఎస్పీబాలసుబ్రహ్మణ్యం, వేణుమాధవ్ వరకు ఆరోగ్యంగా ఉన్నవారందరినీ సోషల్‌మీడియాలోని కొందరు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, మరణించారని కూడా పుకార్లు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మొత్తానికి పి.వాసు మరింతకాలం దర్శకునిగా తన సత్తా చాటుతాడని, పూర్వ వైభవం సాధించాలని కోరుకుందాం...!