దక్షిణాది వారికి, తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఇక ఈ అచ్చతెలుగు పండుగ సందర్భంగా బాలయ్య తెలుగువారందరికీ అచ్చమైన తెలుగులో శుభాకాంక్షలు తెలిపాడు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, నందమూరి బాలకృష్ణ దంపతులు, నారాలోకేష్ దంపతులు కలిసి నారా వారి పల్లెలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. భోగి రోజు భోగి మంటతో చంద్రబాబు సంక్రాంతి సంబరాలను ప్రారంభించి, అందరూ కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తెలుగు ప్రజలందరికీ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు.
తెలుగు వారు మానధనులు. అభిమాన ధనులు నా అభిమానులు. ఇద్దరి అభిమానాన్ని నేను సంపాదించుకున్నాను. ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తుల తూగాలని కోరుకుంటున్నాను. 'జైసింహా' వంటి మంచి చిత్రాన్ని ఆదరించాలని ప్రార్ధిస్తున్నాను.. అన్నారు. మరోవైపు ఆయన నటించిన 'జైసింహా' చిత్రం మెుదటి రెండు రోజుల్లో డీసెంట్ కలెక్షన్లను సాధించింది. మరి సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత గానీ ఈ చిత్రం ఏ స్థాయి హిట్టో తేలుతుంది.
మరోవైపు 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ కావడం, పోటీగా మరో చిత్రం లేకపోవడం ఈ చిత్రానికి కాస్త సానుకూల విషయం. సినిమా అనుకున్న స్థాయిలో లేకపోయినా బాలకృష్ణ కష్టాన్ని, శాయాశక్తులా ఆయన తన నటనను చూపించడానికి ప్రయత్నించడంపై మాత్రం ప్రశంసలు కురుస్తున్నాయి. 'రంగుల రాట్నం' ఫలితం కూడా ఆశించినంతగా లేకపోవడంతో మరోసారి సంక్రాంతిని బాలయ్యే వశం చేసుకున్నాడని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.