తమిళనాట సుందర్ సికి దర్శకునిగా ఒకప్పుడు మంచి ఇమేజ్ ఉండేది. రజనీకాంత్ నటించిన 'అరుణాచలం', కమల్ హీరోగా వచ్చిన 'అన్బేశివం' వంటి చిత్రాలకు ఈయన దర్శకుడు. ఇక ఈయనకు ఇటీవల పెద్దగా కలిసి రావడం లేదు. దాంతో గతంలో తాను తీసిన 'కలకలప్పు'కి సీక్వెల్ చేస్తున్నాడు. 'కలకలప్పు 2'గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జీవి, జై, శివ, నిక్కి గల్రాని, కేథరిన్ థెరిస్సా వంటి వారు నటిస్తున్నారు. బహుశా సుందర్ సి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం హిట్టయితేనే భారీ బడ్జెట్‌తో తేనాండల్ మూవీస్ సంస్థ జయం రవి, ఆర్యలు ప్రధానపాత్రల్లో నటిస్తున్న 'సంఘమిత్ర' పట్టాలెక్కుతుందా? లేదా? అన్నది ఆధారపడి ఉంది. కానీ సుందర్ సి మాత్రం ఈ చిత్రం ఖచ్చితంగా ఉంటుందని ఏప్రిల్ లేదా మే ప్రధమార్దంలో స్టార్ట్ చేస్తామని స్పష్టం చేశాడు.
ఇక ఇందులో నుంచి శ్రుతిహాసన్ తప్పుకోవడంతో దిశాపటానీని లీడ్ రోల్‌లోకి తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక 'కలకలప్పు 2' ప్రమోషన్స్ సందర్భంగా సుందర్ సి. పాలిటిక్స్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హట్ టాపిక్‌గా మారాయి. మీ చిత్రాలలో నటించిన కమల్‌హాసన్, రజనీకాంత్ ఇద్దరు కూడా రాజకీయాలలోకి వస్తున్నారు కదా...! మీ మద్దతు ఎవరికి అంటే ఆయన తన మద్దతు కమల్‌కి కాదని, రజనీకే తన మద్దతని తెలిపాడు.
మరోవైపు ఈయన తమిళనాడులో కాంగ్రెస్ నాయకురాలిగా కీలకంగా ఉన్న ఖుష్బూకి భర్త కావడంతో ఈ అంశం చర్చనీయాంశం అయింది. మాస్ హీరోగా రజనీకాంత్‌కి ఉన్న ఇమేజ్‌తో పోల్చుకుంటే తమిళ నాట కమల్‌కి వీరాభిమానులు తక్కువే. దాంతో రజనీ ఫ్యాన్స్‌ని తనవైపుకి తిప్పుకుని తన 'కలకలప్పు ౨'కి వాడుకోనున్నాడా? అనే చర్చ సాగుతోంది. మరోవైపు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రజనీకి మద్దతు ఇస్తున్నారు. వీరిలో అన్ని పార్టీలవారు కూడా కలిసి ఉన్నారు. మరి వారంతా మిగిలిన పార్టీల నుంచి బయటకి వచ్చి రజనీకి మద్దుతు ఇస్తారా? లేక మాటలకే పరిమితమవుతుందా? అనేది వేచిచూడాల్సివుంది..!