ప్రస్తుతం అందరి దృష్టి రచయిత, నిర్మాత, నటుడు అయిన కోన వెంకట్ మీదనే ఉంది. ఎందుకంటే ఆయన పవన్ ఫ్యాన్స్‌కి, కత్తి మహేష్‌కి మొదలైన వివాదానికి పరిష్కారం చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక కోన వెంకట్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈయన తాత కోన ప్రభాకర్ రావు బాపట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, నాటి కాంగ్రెస్ సీనియర్, కీలక నాయకునిగా, ఏపీకి ఆర్ధిక మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా, నాటి పాండిచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా, సిక్కిం, మహారాష్ట్రలకు గవర్నర్‌గా కూడా పనిచేశాడు. ఇక ఈయన నాడు సినిమాలలో హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, దర్శకునిగా, నిర్మాతగా కూడా రాణించారు.
ఇక కోనవెంకట్ విషయానికి వస్తే ఆయన నాటి ప్రముఖ హాస్యనటుడు, కాంగ్రెస్ నేత, ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో సీనియర్ నరేష్ హీరోగా నటించిన 'తోకలేని పిట్ట'కి నిర్మాత. తర్వాత ఆయన వర్మ ప్రోత్సాహంతో 'సత్య' చిత్రంలోని 'మామా కల్లు మామ' అనే పాటను రాశాడు. వర్మ కథలు, మాటలు కూడా రాయమని ప్రోత్సహించండంతో పలు తెలుగు చిత్రాల హిందీ వెర్షన్స్‌కి రైటర్‌గా పనిచేశాడు. ఇక శ్రీనువైట్లతో కలిసి 'ఢీ' చిత్రం ద్వారా ఈయన టాలీవుడ్‌లోకి బకరా కామెడీ చిత్రాల ట్రెండ్‌ని సృష్టించాడు. అలా దాదాపు అందరు అగ్రహీరోలతో శ్రీనువైట్ల తెరకెక్కించిన చిత్రాలన్నింటికి రచయితగా కీలకపాత్రను పోషించాడు.
'గీతాంజలి, శంకరాభరణం, అభినేత్రి' వంటి చిత్రాలకు నిర్మాతగా, కొందరు దర్శకులకు తెర వెనుక డైరెక్షన్ కూడా చేశాడని పేరుంది. ఇక ఈయనకు శ్రీనువైట్లతో పరిచయం ఎలా జరిగిందంటే పూరీ జగన్నాథ్, రవితేజల కాంబినేషన్‌లో రూపొందిన 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రం షూటింగ్ స్పాట్‌కి ఈయన వెళ్లాడు. అప్పుడు పూరీ ఈయనను రవితేజకి పరిచయం చేశాడు. రవితేజ సోలో హీరోగా పరిచయం చేస్తూ, వల్లభనేని జనార్ధన్, ఈనాడు రామోజీరావుల భాగస్వామ్యంలో విడుదలైన 'నీ కోసం' ద్వారా అప్పటికే రవితేజకి శ్రీనువైట్ల బాగా క్లోజ్.
దాంతో రవితేజ.. కోనవెంకట్‌ని శ్రీనువైట్లకి పరిచయం చేయగా, శ్రీనువైట్ల.. గోపీమోహన్‌కి పరిచయం చేశాడు. తర్వాత కోన వద్ద ఉన్న ఓ కథ ఆధారంగా టీం అంతా నాగార్జున సాగర్‌కి వెళ్లి ఓ స్క్రిప్ట్ తయారు చేశారు. అదే 'వెంకీ' చిత్రం. ఇలా ఇండస్ట్రీలోని పరిచయాలు ఎవరి జీవితాలను ఎప్పుడు మలుపుతిప్పుతాయో ఎవ్వరూ చెప్పలేరు...!