అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుమంత్ సోదరి, యార్లగడ్డ సుప్రియ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈమె ఏయన్నార్ మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన తొలి చిత్రం 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి'ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ఆమె నటిగా పెద్దగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత కూడా ఆమె 'తుఝే మేరీకసమ్, పంజాబ్' చిత్రాలలో పాలు పంచుకుంది. భర్త చరణ్ రెడ్డి కూడా 'ఇష్టం' చిత్రంలో శ్రియతో పాటు తెలుగుతెరకు విక్రమ్ కె.కుమార్ ద్వారా, రామోజీరావు నిర్మాతగా పరిచయమయ్యాడు. తర్వాత ఆయన అనారోగ్యంతో మరణించాడు.
ఇక సుప్రియ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌కి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటూ ఈ స్టూడియోని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ది చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఎంతో కాలం తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకులకు తెరపై కనిపించనుంది. ఎన్నారైగా అమెరికాలో ఉండి, 'కర్మ' చిత్రం ద్వారా హీరోగా, దర్శకునిగా, నిర్మాతగా, రచయితగా పరిచయమై తర్వాత 'పంజా'తో పాటు 'క్షణం', 'బాహుబలి' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అడవి శేషు హీరోగా, శోభిత దూళిపాళ్ల హీరోయిన్‌గా, శశికిరణ్ దర్శకత్వంలో అభిషేక్‌నామా నిర్మిస్తున్న 'గూఢచారి' అనే స్పై థ్రిల్లర్ చిత్రంలో సుప్రియ కీలక పాత్రను పోషిస్తుంది.
షూటింగ్ పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రంలో సుప్రియ నటిస్తున్న విషయాన్ని నిర్మాత అభిషేక్ నామా దృవపరిచాడు. ఇందులో సుప్రియ పాత్ర ఎంతో కీలకంగా, వైవిధ్యంగా ఉండటంతోనే ఇంత కాలం గ్యాప్ తర్వాత ఆమె మరలా వెండితెరపై కనిపించడానికి ఓకే చేసిందని సమాచారం. ఇక సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారు. మరి 'క్షణం' చిత్రంలో అనసూయకి వచ్చినంత పేరు ఈ 'గూడచారి' ద్వారా సుప్రియకు లభిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది..!