తెలుగు సినిమాలలో ఒకప్పుడు ఎంత పెద్ద స్టార్స్ నటించే చిత్రాలలోనైనా కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ నేడు ట్రెండ్ అలా సాగడం లేదు. ఫస్ట్‌లుక్, టైటిల్, టీజర్, ట్రైలర్స్ వంటి వాటితో పాటు ఫొటో షూట్స్ వంటి వాటిపై పెట్టిన శ్రద్ద కంటెంట్‌పై పెట్టడం లేదు. మిగిలిన విషయాలలో హైప్‌ని క్రియేట్ చేయాలని చూస్తూ అసలు విషయాలను మాత్రం మర్చిపోతున్నారు. ప్రస్తుతం పవన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'అజ్ఞాతవాసి' మీద కూడా ఈ కోవలోకే వస్తోంది. గతంలో త్రివిక్రమ్‌కి 'ఖలేజా' వంటి ఫ్లాప్ ఉండి ఉండవచ్చుగానీ ఆ చిత్రం కథ విషయంలో ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఇప్పటికీ ఈచిత్రం టీవీచానెల్స్‌లో వస్తోందంటే వీక్షకులు చూస్తూనే ఉన్నారు. మంచి టీఆర్పీలు వస్తూనే ఉన్నాయి. కానీ మొదటి సారిగా త్రివిక్రమ్ ఓ కథా రచయితగా ఫెయిల్ అయ్యాడనే టాక్ 'అజ్ఞాతవాసి' విషయంలోనే వస్తోంది.
ఈ చిత్రం విడుదల సందర్భంగా పరుచూరి బ్రదర్స్‌లోని ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజలు.. ఈ చిత్రం త్రివిక్రమ్ వదిలిన అస్త్రమని, కలెక్షన్ల సునామీ ఖాయమని పొగిడేస్తున్నారు. కానీ అభిమానులు, ఆ సినిమాకి పని చేసిన వారు ముందుగా తమ చిత్రం అదిరిపోతుందంటే వారి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చుగానీ తమ్మారెడ్డిభరద్వాజతో పాటు ఎంతో అనుభవం, సినిమా కెరీర్‌లో అద్భుత విజయాలు, ఊహించని పరాజయాలు పొందిన అనుభవం ఉన్న పరుచూరి గోపాలకృష్ణ కూడా ఈ చిత్రం వల్ల పవన్ అభిమానులకు, తెలుగు సినీ ప్రేక్షకులకు నాలుగు రోజుల ముందే సంక్రాంతి వచ్చిందని డబ్బాలుకొట్టడం సరికాదు.
సినిమా చూసిన తర్వాత మాట్లాడితేనే వీరి పెద్దరికాలు నిలుస్తాయి. అంతే కానీ సినిమా చూడకుండానే సగటు వీరాభిమాని కంటే ఎక్కువగా ఏవేవో ప్రశంసల వర్షం కురిపించడం పరుచూరి గోపాలకృష్ణ వంటి వారికి తగని పని. ఇక 'అజ్ఞాతవాసి' చిత్రం ఫస్ట్ వీకెండ్‌లో తప్ప సంక్రాంతిని పూర్తిగా క్యాష్ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు 'జైసింహా, రంగుల రాట్నం' పైనే ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా ఇది బాలయ్య 'జైసింహా'కి కలిసొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.