మొత్తానికి పవన్‌కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ మద్య విడుదలైంది. కానీ ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. సినిమా విమర్శకులు ముక్తకంఠంతో ఈ చిత్రం బాగాలేదని చెబుతున్నారు. మరోవైపు కత్తి మహేష్-పవన్ ఫ్యాన్స్‌కి మధ్య జరుగుతున్న వార్ నేపధ్యంలో ఈ చిత్రం గురించి కత్తిమహేష్ ఇచ్చే రివ్యూపై పలువురు ఆసక్తిగా ఎదురు చూశారు.
ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని చూసిన కత్తిమహేష్ మాట్లాడుతూ, పవన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'జల్సా, అత్తారింటికిదారేది' చిత్రాలతో పోల్చుకుంటే ఈ చిత్రం చెత్తగా ఉందని కామెంట్ చేశాడు. సీరియస్ కథకి మధ్యలో చొప్పించిన కామెడీ చికాకును కలిగించిందని ఆయన అన్నారు. పవన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన చెత్త చిత్రం ఇది అని చెబుతూ, ఈ చిత్రంలోని పాటకి తగ్గట్టుగా రిస్క్ చేసి చూస్తే టైమేమో.. అంటూ తనదైన శైలిలో కౌంటర్ వేశాడు. కానీ పవన్ అభిమానులు మాత్రం ఈ చిత్రం చాలా బాగుందని అంటున్నారు.
ఈ చిత్రాన్ని చూసిన హైపర్ ఆది మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని పవన్ కోసం పదిసార్లు చూడవచ్చు. త్రివిక్రమ్ కోసమైతే మూడు సార్లు చూడవచ్చు. మిగిలిన ఆర్టిస్ట్‌ల కోసమైతే వీలున్నప్పుడల్లా చూడవచ్చు అని అంటున్నాడు. ఈ చిత్రంలో బొమ్మన్ ఇరాని చెప్పిన 'రాజ్యం మీద ఆశలేనోడికంటే గొప్పరాజు ఎవడుంటారు?' అనే డైలాగ్ తనకి బాగా నచ్చిందని ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అంటున్నాడు.
కానీ మొదటి నుంచి త్రివిక్రమ్ శైలి ఎలా ఉంటుందంటే ముందు ఓ డైలాగ్ అనుకుని దానికి తగ్గట్లుగా ఆయన సీన్స్‌ని రాసుకుంటాడనే విమర్శ ఉంది. ఈ చిత్రం కూడా అదే కోవలోకి వస్తుందని అంటున్నారు. మొత్తానికి ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో లేదని మాత్రం అందరూ ఒప్పుకుంటున్నారు.