సంక్రాంతి హీరోగా సూపర్‌స్టార్ కృష్ణ తర్వాత బాలయ్యకి అంతటి పేరుంది. ఒకవైపు ఆ సెంటిమెంట్, మరోవైపు 'సింహా టైటిల్స్ అయిన 'నరసింహానాయుడు, సమరసింహారెడ్డి, లక్ష్మీనరసింహ, సింహా' వంటి మరో సెంటిమెంట్ గా 'జై సింహా' వస్తోంది. అందునా అది తన తండ్రి చేసిన సినిమా టైటిల్ కావడం మరో సెంటిమెంట్. సెంటిమెంట్లు బాగా ఫాలో అయ్యే బాలయ్యకి ఇవ్వన్నీ కలసి వస్తే 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కానున్న 'జైసింహా' పెద్ద హిట్ కొట్టడం గ్యారంటీ అని నందమూరి అభిమానులు ఆశతో ఉన్నారు.
ఈ విషయమై బాలయ్య మాట్లాడుతూ, ఈ చిత్రం కేవలం మాస్ చిత్రం కాదు.. నవరసాలు ఇందులో ఉంటాయి. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం ఇది. టైటిల్ బ్రహ్మాండం. ఈ సినిమాతో నాన్న గారు సినిమా చేశారు. దానికి ముందు ఆయన చేసిన రెండు చిత్రాలు ఆర్ధికంగా నష్టాలను తెచ్చాయి. దాంతో ముందు మనం ఆర్దికంగా స్ధిరపడిన తర్వాతే చేయాలని నాన్నగారు భావించారు. అలా వచ్చిన 'జయసింహా' పెద్ద విజయం సాధించింది. ఇక నాపై నా తండ్రి ప్రభావం ఎక్కువ. ఈ స్ఫూర్తితోనే 57ఏళ్ల వయసులో కూడా కొత్త బాలకృష్ణ ఆవిష్కృతం అవుతుండటం ఎంతో ఆశ్చర్యం. గ్రేట్‌గా ఫీలవుతాను.
నాన్నగారు చేసిన 'శ్రీరామరాజ్యం' చేయడం అంటే మాటలు కాదు. ఇక వందో చిత్రంగా దేశాన్ని పాలించిన చక్రవర్తిగా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చేశాను. అలాంటి చిత్రం తర్వాత మరలా 'పైసా వసూల్' అనే మాస్ చిత్రంలో నటించడమంటే మాటలు కాదు. నా జీవితంలో నేను చేస్తున్నవి ఏమీ ముందుగా ప్లాన్ చేసుకున్నవి కావు. యాదృచ్చికంగా వచ్చి వాలి జరుగుతూ ఉన్నాయి. నటనంటే అరవడమో, ఏడవడమో, ఓ నవ్వు నవ్వడమో కాదు. ఆ పాత్రలో లీనమై అందులోంచి బయటికి రావాలి. అంటూ చెప్పుకొచ్చారు.