ఎపిసోడ్ ఎపిసోడ్లుగా, డైలీ సీరియల్‌గా కత్తిమహేష్, పవన్ ఫ్యాన్స్‌ల గొడవ సాగుతూనే ఉంది. ముందుతప్పు చేసింది నువ్వు అంటే కాదు నువ్వు అని కలహించుకుంటున్నారు. ఏదిఏమైనా నంది గొడవ సద్దుమణిగిన వెంటనే మీడియాకి ముఖ్యంగా నవగ్రహం ఛానెల్‌కి మాత్రం ఇది 'లడ్డూకావాలా నాయనా' అన్నట్లు దొరికింది. నంది అవార్డుల విషయంలో కూడా అసలు వ్యక్తులు మౌనంగా ఉంటే మధ్యలో వచ్చిన బండ్లగణేష్, బన్నీవాసు, సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్ వంటి వారిదే ఇష్టమైపోయింది. నంది వివాదంతో వుయ్ రిపోర్ట్ - యూ డిసైడ్ ఛానెల్ బాగా టీఆర్పీలు పిండుకోవాలని చూసింది. అంటే వారి ఉద్దేశ్యం ప్రకారం మేము రెచ్చగొడుతాం... మీరు మీరు తన్నుకు చచ్చి, చివరికి నిర్ణయం తీసుకోండి అని ఆ ఛానెల్ చాటిచెప్పింది. ఇప్పుడు మెరుగైన సమాజం కోసం ఈ నవగ్రహ ఛానెల్ పిలిచి మరీ గొడవలు పెడుతోంది.
మొత్తానికి గత నాలుగైదు నెలలుగా కత్తిమహేష్ తన వృత్తినే మర్చిపోయి ఇల్లు ఎలా గడుపుతున్నాడో అర్ధం కాని పరిస్థితి. పవన్ అయితే 'అజ్ఞాతవాసి' రెమ్యూనరేషన్‌తో లాక్కొస్తాడు. మరి జర్నలిజం వృత్తిని చేయకుండా కత్తి మహేష్ సంసారాన్ని ఈదాలంటే ఆ నవగ్రహం ఛానెల్ సాయం పెద్దదిగానే ఉండి ఉండవచ్చు. మరోవైపు ఈ వివాదంలో కూడా మధ్యలో చేరిన వారు సద్దు బాటు చేయాల్సింది పోయి అగ్గికి ఆజ్యం పోసి, బాగా నెయ్యి, పెట్రోల్ పోసి వెచ్చగా చలికాలంలో చలికాచుకున్నారు. ఇంతకాలానికి కోన వెంకట్ రూపంలో పెద్ద మనిషి రావడంతో ఈ వివాదం ఆగుతుందనే నమ్మకం ఏర్పడుతోంది. ఆయన పవన్‌కి కూడా కావాల్సిన వ్యక్తి కావడంతో ఈ నెల 15 వరకు కత్తి మహేష్ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, పవన్ ఫ్యాన్స్ మౌనంగా ఉండాలని కోరాడు.
ఇది నిజంగా మంచి పరిణామం. సిగ్గులేని మీడియా, సినీ పెద్దలు చేయలేని పనిని కోనవెంకట్ భుజానికెత్తుకున్నాడు. ఇక పవన్ ఫ్యాన్స్ విషయానికి వస్తే అభిమానం ఉండవచ్చు.. సమాధానం చెప్పవచ్చు.. మాటకి మాట చెప్పవచ్చు గానీ కాస్త అసభ్యపదజాలం, చంపుతాం. తంతా.. అనే మాటలు మానుకోవాల్సివుంది. వాస్తవానికి ఈ వివాదంతో పవన్‌కి ప్రత్యక్ష ప్రమేయం లేదు. కాబట్టి పవనే నాకు క్షమాపణ చెప్పాలని కత్తిమహేష్ ఆశిస్తే మాత్రం అది అవివేకం అవుతుంది. కోనవెంకట్ పవన్ నుంచి ఎలాంటి స్పందనను తీసుకొచ్చినా తగ్గాల్సిన బాధ్యత కత్తి మహేష్‌పైనే ఉందనేది వాస్తవం.