కొత్త ఒక వింత..పాత ఒక రోత అనే మనస్తత్వం మనల్ని ఇంకా పీడిస్తూనే ఉంది. ఎన్నో ఏళ్లు బ్రిటిష్ వారు పరిపాలించిన తర్వాత కూడా మనం బానిస బతుకులను, భావదారిద్య్రాన్ని మానుకోలేకపోతున్నాం. అదే జీ హుజూర్ అని సలాంలు చేస్తున్నాం. పాలకులు కూడా ప్రజలు అలాగే ఉండాలని కోరుకుంటున్నారు. నేటి విద్యావంతుల్లో కూడా కుల, మత భావాలు ఉన్నట్లే ఆడవారిలో కూడా పిల్లలను కంటే అందాలు తరిగి పోతాయనే భ్రమ వీడటం లేదు. ఓ వైపు మాతృత్వం కోరుకుంటూనే మరోవైపు తమ అందం చెదిరిపోకూడని భావిస్తున్నారు. పిల్లలను కనడం, తల్లిపాలతోనే పెంచడం వల్ల అందం ఏమాత్రం తగ్గదని మన సంప్రదాయాలు ఘోషిస్తున్నా.. మనం మాత్రం సహజీవనం నుంచి సరోగసీ దాకా పాశ్చాత్య పోకడలలోనే ఉన్నాం.
ఇక విదేశాల నుంచి దిగుమతి అయిన సరోగసీ ఇప్పుడు చాలా మందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతోంది. మొదట్లో కేవలం బాలీవుడ్, ఉన్నత కుటుంబాలలో ఉన్న ఈ పద్దతి ఇప్పుడు సామాన్యుల వరకు చేరింది. కానీ అందరు మోహన్‌బాబు లక్ష్మీప్రసన్న విషయంలో లాగా డేర్‌గా ప్రకటించలేకపోతున్నారు. ఇక బాలీవుడ్‌లో షారుఖ్‌ఖాన్, తుషార్‌కపూర్ కరణ్‌జోహర్ వంటి వారు ఇలాగే బిడ్డలకు తండ్రులయ్యారు. అయితే ఈ పద్దతి కంటే సుస్మితా సేన్‌లాగా, సన్నిలియోన్‌లాగా సరోగసీ కంటే అనాధ పిల్లల దత్తతే మంచింది.
ఇక విషయానికి వస్తే తన తాజా చిత్రం 'హిచ్కి' ప్రమోషన్ కోసం తన సహనటుడు, సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా చేస్తున్న బిగ్‌బాస్ 11కి అతిధిగా రాణి ముఖర్జీ వచ్చింది. యష్‌రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్యచోప్రాను ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు టాప్‌హీరోయిన్‌గా బాలీవుడ్‌లో వెలిగిన రాణి ముఖర్జీ సల్మాన్‌లో కలిసి 'బాబుల్, హలో బ్రదర్, చోరీ చోరీ చుప్కే చుప్కే, కహీ ప్యార్ నా హోజాయే, హమ్‌దిల్‌జో ప్యార్‌కరేగా' వంటి చిత్రాలలో నటించింది. ఇక తాజాగా ఆమె బిగ్‌బాస్ షోలో మాట్లాడుతూ, సల్మాన్ ఎలాగైనా పిల్లలని కనాలని, పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదు. తన బిడ్డ ఆదిరాకు ఓ ఫ్రెండ్ కోసం ఓ బిడ్డకు జన్మనివ్వాలని కోరింది. సల్మాన్‌కి బేబీ పుడితే ఆయనలాగే అందంగా ఉంటుందని అని అనడంతో మరి తల్లి పోలికలు వచ్చి బిడ్డ అందంగా లేకపోతే పరిస్థితి ఏంటి? అని సల్మాన్ ప్రశ్నించడంతో ఈ షోలో నవ్వులు విరబూశాయి. సో.. ఈ లెక్కన చూసుకుంటే పెళ్లి చేసుకోకపోయినా సల్మాన్ తండ్రి కావడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది.