పరిపూర్ణ నటుడు అంటే అభినయం, ఆహార్యంతో పాటు వాచికం కూడా ప్రధానం. గతంలో కె.విశ్వనాథ్ వంటి దర్శకుని చిత్రమైన 'స్వాతికిరణం'కి పట్టుబట్టి మమ్ముట్టినే ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇక నాడు సుమన్, రాజశేఖర్‌లు సాయికుమార్ గాత్రంపై ఆధారపడేవారు. నాటి రోజుల్లో సుమన్, కృష్ణంరాజు, జయసుధ, సిల్క్‌స్మితలు నటించిన 'బావ బావమరిది' చిత్రానికి ఉత్తమ నటుడుగా సుమన్‌కి నంది అవార్డు ప్రకటించినప్పుడు కూడా ఇదే పెద్ద రగడకు కారణమైంది.
ఇక తెలుగులో రజనీకాంత్, కమల్‌హాసన్‌లు కూడా సాయికుమార్, మనో, ఎస్పీబాలు వంటి వారిపై ఆధారపడుతున్నారు. కానీ ఇటీవల తెలుగులోకి వస్తున్న పరభాషా హీరోయిన్లు అయిన చార్మి, కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్, రాశిఖన్నా, సాయిపల్లవి వంటి వారు తామే డబ్బింగ్ చెప్పుకుంటూ తమ కమిట్‌మెంట్ చాటుకుంటున్నారు. ఇకపై తాము కూడా ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటామని రకుల్‌ప్రీత్‌సింగ్, రాశిఖన్నాలు కూడా ప్రకటించారు. మరోవైపు మన తెలుగు వారు కూడా సాయికుమార్ ఆయన సోదరుడు రవిశంకర్ వంటి వారి డబ్బింగ్‌లపై ఆధారపడుతున్నారు.
తాజాగా సూర్య మాత్రం ఓ మంచి నిర్ణయానికి వచ్చాడు. తెలుగులో స్టార్ హీరోగా పేరున్న వారిలో రజనీ, కమల్, విక్రమ్‌లతో పాటు సూర్యని కూడా చెప్పుకోవాలి. ఇప్పటివరకు 'గజిని' నుంచి సూర్య నటిస్తున్న ప్రతి చిత్రం తెలుగులోకి విడుదలవుతోంది. ఆయన పాత్రలకు శ్రీనివాసమూర్తి అనే వ్యక్తి గాత్రదానం చేస్తున్నాడు. గతంలో 'బ్రదర్స్' అనే చిత్రంలో డబ్బింగ్ ఓన్‌గా చెప్పాలని సూర్య ప్రయత్నించాడు. అది పెద్దగా నెరవేరలేదు. తాజాగా మాత్రం సూర్య తాను అనుకున్నంత పని చేశాడు. ఎంతో కాలంగా హిట్ లేక ఎదురుచూస్తున్న సూర్య నటించిన 'తానా సేంద్రకూట్టం' చిత్రం సంక్రాంతి కానుకగా అంటే పొంగల్ కానుకగా తమిళ, తెలుగు భాషల్లో భారీ పోటీ మధ్య విడుదలవుతోంది.
తెలుగులో పవన్ 'అజ్ఞాతవాసి', బాలకృష్ణ 'జైసింహా', రాజ్‌తరుణ్-నాగార్జునల 'రంగుల రాట్నం'తో పాటు ఈ చిత్రం 'గ్యాంగ్' పేరుతో విడుదల కానుంది. ఇందులో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటించడం, రమ్యకృష్ణ కీలకమైన పాత్రను చేయడం విశేషం. మరోవైపు తమిళంలో కూడా ఈ చిత్రం విక్రమ్ 'స్కెచ్', ప్రభుదేవా 'గులేభకావళి', అరవింద్‌స్వామి 'భాస్కర్ ఒరు రాస్కెల్' వంటి పోటీలో విడుదలవుతోంది.
తన మాతృభాష అయిన తమిళంలో సూర్య ఓ చిత్రానికి డబ్బింగ్ చెప్పడానికి రెండు గంటలు మాత్రమే తీసుకుంటాడట. కానీ తెలుగులో మొదటి సారి ఓన్ డబ్బింగ్ కోసం ఆయన వారం రోజులు కష్టపడ్డాడని తెలుస్తోంది. మరి ఇది సినిమాకి ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనేది చూడాలంటే 14వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.