మంచు మోహన్‌బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు మంచు. ఈయన మొదట్లో పిఈటీ టీచర్‌గా పనిచేసి, తర్వాత మద్రాస్ వెళ్లి దాసరి ప్రోత్సాహంతో ఎంతో కష్టపడి పైకొచ్చాడు. దాసరే ఆయన పేరును భక్తవత్సలం నుంచి మోహన్‌బాబుగా మార్చాడు. మరి ఆ పేరు మార్చిన వేళా విశేషం మోహన్‌బాబు ఎంతో ఉన్నతస్థితికి వచ్చాడు. ఇక తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కాదు.. ఆ పుత్రుడు ప్రయోజకుడై పది మంది గొప్పగా చెప్పుకుంటేనే నిజమైన పుత్రోత్సాహం వస్తుందని కవి చెప్పినట్లు మోహన్‌బాబుకి తగ్గ వారసులుగా ఇప్పటివరకు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మిప్రసన్న ఎవ్వరూ ఎదగలేదు. వారి కెరీర్ ఇప్పటికీ నత్తనడకనే నడుస్తోంది.
ఇక మంచు విష్ణుకి ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. వారే అరియానా, వివియానా. తాజాగా నూతన సంవత్సరం బోనస్‌గా మూడోతరం వారసుడిగా ఓ కుమారుడు జన్మించాడు. దాంతో మంచు ఫ్యామిలీ బాగా ఆలోచించి జీవితంలో ఎలా ఎదుగుతాడో తెలియదు గానీ పేరులో మాత్రం అదుర్స్ అనిపించింది. తన తండ్రి పేరులోని భక్త అనే పదాన్ని తీసుకుని, తన కుమారుడికి అవ్రం భక్త అనే పేరును పెట్టినట్లు తాజాగా మంచు విష్ణు అఫీషియల్‌గా ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఇక అవ్రం భక్త మంచులోని అవ్రం అంటే ఎవరు ఆపలేని వాడు అని అర్ధమట. ఇక అవ్రంని విష్ణు కూతుర్లు ఎలా పిలుస్తారో కూడా మంచు విష్ణు చెప్పాడు.
అరియానా ఆ పిల్లాడిని బేబీ లయన్ అని, వివియానా బేబి టెడ్డీబేర్ అని పిలుస్తున్నారట. ఇంట్లోని మిగిలిన వారు మాత్రం అవ్రంభక్త మంచు అనే పిలుస్తారట. ఇక మోహన్‌బాబు కొత్త ఏడాదిలో 'గాయత్రి'తో రానున్నాడు. మరోవైపు మంచు విష్ణు కూడా ఇందులో నటిస్తున్నాడు. మరోవైపు మంచు విష్ణు తనకి అచ్చివచ్చిన దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డితో బ్రహ్మానందంతో కలిసి సెంటిమెంట్‌గా తనకి కలిసి వచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ నెలాఖరులో 'ఆచారి అమెరికా యాత్ర' ద్వారా రానున్నాడు. ఫిబ్రవరిలో తండ్రితో కలిసి 'గాయత్రి'గా, ఆ తర్వాతి నెల 'ఓటర్'గా వరుసగా కొత్తఏడాదిలో మూడు నెలల్లో మూడు చిత్రాలు రిలీజ్‌కి విష్ణు సిద్దం అవుతున్నాడు. మరి కొడుకు పుట్టిన వేళావిశేషంలోనైనా మంచు విష్ణుకి మంచి హిట్ వస్తుందేమో చూడాలి. మొత్తానికి అవ్రం భక్త మంచు మాత్రం తన తాత స్థాయికి ఎదగాలని కోరుకుందాం...!