ఒకప్పుడు సినీరంగంలోకి ప్రవేశించడానికి ఎంత టాలెంట్ ఉన్నా కూడా తమకు ఎప్పుడు అవకాశం వస్తుంది? అవకాశం వచ్చినా ఎప్పుడు బ్రేక్ వస్తుందో తెలియదు. దానికి ఎంతో కాలం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నటులు, దర్శకులు ఎన్నో చిత్రాలలో నటిస్తే గానీ బ్రేక్, ఇమేజ్ వచ్చేవి కావు. ఇక దర్శకులైతే ఎందరి దర్శకుల వద్దనో ఏళ్లకు ఏళ్లు తరబడి దర్శకత్వ శాఖలో పనిచేస్తే గానీ సొంతగా డైరెక్షన్ చాన్స్ వచ్చేది కాదు. నిర్మాతలకు నమ్మకం కలిగించేందుకు వారికి జీవితకాలం పట్టేది. ఉదాహరణకు షిండే అనే మన దర్శకుడి విషయానికి వస్తే ఎన్నో ఏళ్లు ఆయన దర్శకత్వశాఖలో పనిచేసిన తర్వాత సొంతగా దర్శకత్వం వహించే నాటికే వయసు మీద పడింది. రెండు మూడు చిత్రాల అనంతరమే ఆయన మరణించాడు. కానీ నేడు పరిస్థితి అలా లేదు.
వర్మ వంటి వారు ఒక్క సినిమాకి కూడా సరిగా పనిచేయకుండానే దర్శకులై సంచలనం సృష్టించారు. ఇక నేడు అయితే షార్ట్‌ఫిల్మ్స్ ద్వారా ఎవరి దగ్గరా పనిచేయని వారు కూడా ఒకేసారి దర్శకులుగా మారుతున్నారు. దీనికి 'సాహో' దర్శకుడు సుజీత్ నుంచి 'అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా వరకు చెప్పుకోవచ్చు. ఇక నటునిగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో గ్యాంగ్‌లో ఒకడిగా చేసి, 'ఎవడే సుబ్రహ్మణ్యం'లో కాస్త ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసి 'పెళ్లిచూపులు'తో హీరోగా సక్సెస్ అయిన విజయ్‌దేవరకొండ ఒకే ఒక్క 'అర్జున్‌రెడ్డి'తో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. అయితే నేడు మరో సమస్యమాత్రం ఉంది. వచ్చిన విజయాలకు అనుగుణంగా చిత్రాల ఎంపికలో జాగ్రత్తగా లేకపోతే ఎంత తొందరగా స్టార్‌డమ్ తెచ్చుకుంటున్నారో అంతే తొందరగా ఫేడవుట్ అయ్యే అవకాశం కూడా ఉంది.
ఏమైనా తేడా వస్తే ఇక మూడు చిత్రాల ముచ్చటగానే పరిస్థితి మారుతోంది. ఇక 'అర్జున్‌రెడ్డి' ఫేమ్ విజయ్‌దేవరకొండ విషయానికి వస్తే ఆయన ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారడమే కాదు.. చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. గీతాఆర్ట్స్ అల్లుఅరవింద్, దిల్‌రాజు, బాలీవుడ్‌కి చెందిన యష్‌రాజ్ ఫిల్మ్స్, కోలీవుడ్‌కి చెందిన లైకా ప్రొడక్షన్స్ నుంచి స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్‌రాజా వరకు ఈ హీరో కాల్షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక 2017లో 'బాహుబలి-ది కన్‌క్లూజన్' తర్వాత అంతటి సంచలనం కేవలం 'అర్జున్‌రెడ్డి' మాత్రమే సాధించింది. ఇక కొత్త ఏడాది సందర్భంగా విజయ్‌దేవరకొండ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేసి, ఓ వైపు చిరు నవ్వులు చిందిస్తూ మానాన్న, మరోవైపు అవార్డును అందిస్తూ మెగాస్టార్ అంటూ ఓ ట్వీట్ చేసి, ఫొటోని పోస్ట్ చేశాడు. తన తల్లిదండ్రుల కోసం ఏమి చేయడానికైనా తాను రెడీ అని చెప్పుకొచ్చాడు.మరి కొత్త ఏడాదిలో విజయ్ ఏ మేరకు సంచలనాలు సృష్టిస్తాడో వేచిచూడాల్సివుంది..!