చిరంజీవి సినిమాలలో ఉన్నంతకాలం 'అందరివాడు' అనిపించుకున్నాడు. ఇక రాజకీయాలలోకి ప్రవేశించిన తర్వాత కూడా 'అందరివాడు'గా మిగులుతాడని పలువురు భావించారు. కానీ ఎన్నికల తర్వాత, ఫలితాల నేపధ్యంలో ఆయన 'కొందరివాడు'గానే మిగిలిపోయాడనేది వాస్తవం. ఇక ఆయన మరలా సినిమాలలోకి వచ్చి 'అందరివాడు' అనిపించుకునే పనిలో ఉన్నాడు. ఇక పవన్‌కళ్యాణ్ విషయానికి వస్తే ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాలలో, కుల మత, ప్రాంతాల వారీగా కాకుండా తెలుగువారందరిలో ఆయనకు అభిమానులు ఉన్నారు అనేది వాస్తవం.
కానీ ఆయన తెలంగాణ విభజన తర్వాత రాష్ట్రవిభజన తనను బాధించిందని చెప్పాడు. అయితే ఆయన ఎక్కడా ప్రత్యేక తెలంగాణని వ్యతిరేకించలేదు. కేవలం 'గౌరవంగా తెచ్చుకోవాల్సిన తెలంగాణను ఇలా గందరగోళాల మద్య తెచ్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు'. ఏదిఏమైనా అది తెలంగాణ ప్రజలకు కాస్త కోపాన్ని తెప్పించింది. ఇక పవన్ పార్టీ పెట్టకముందు, పెట్టిన తర్వాత కూడా ఆంధ్రా విషయాలు, సమస్యలపైనే గళం విప్పుతుండటంతో పవన్‌ని ఆంధ్రా పక్షపాతిగా ముద్రవేశారు. నిజానికి ఆయన తెలంగాణలో ఎన్నో సమస్యలు, చేనేతకార్మికులు, బీడీ కార్మికుల సమస్యలు ఉన్నా పెద్దగా స్పందించని మాట వాస్తవం.
ఇక పవన్ ఇప్పుడు చాలా బిజీ మనిషి. ఒకవైపు సినిమాలు, మరో వైపు సమాజ సమస్యలు, ట్వీట్స్, జనసేన సంస్థాగత పటిష్టత వంటి వాటిల్లో ఆయన బిజీ. ఆయన బిజీ వల్ల ఏ ఫంక్షన్లకు, తన సొంత అన్నదమ్ముల ఫంక్షన్లకురావడానికి కూడా ఆయనకు సమయం లేదు. కానీ ఆయన తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావుని కలవడానికి సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రగతిభవన్‌కి వెళ్ళాడు. కానీ అదే టైం లో సీఎం కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ ని కలిసేందుకు వెళ్లినందున దాదాపు కేసీఆర్ కోసం గంటసేపు వెయిట్ చేయడం అనేది ఆసక్తిని రేపుతోంది.
మరోవైపు పవన్ కేవలం న్యూఇయర్ శుభాకాంక్షలు తెలపడానికే వెళ్లానని చెబుతున్నాడు. మరోవైపు ఆయన సమర్దిస్తున్న ఏపీ ప్రభుత్వం న్యూఇయర్ వేడుకలు, గుళ్లలో ప్రత్యేక పూజలని కూడా నిలిపివేసి ఉగాదికి జరుపుకోమని చెప్పింది. మరి ఆ విషయం పవన్‌కి తెలియదా? లేక తాను మాత్రం తెలుగు ఉగాదిని కాకుండా జనవరి1నే ఎందుకు ఎంచుకున్నాడు? అనేది మరో ప్రశ్న