డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చిన నాని తన మొదటి చిత్రమే బాపు వంటి లెజెండరీ దర్శకుని వద్ద 'రాధాగోపాళం' చిత్రానికి పనిచేశాడు. ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్‌కృష్ణ చేతి పుణ్యమా.. వరుసగా ట్రిపుల్ హ్యాట్రిక్‌వైపు దూసుకెళ్తున్నాడు. డివైడ్ టాక్ తెచ్చుకున్న 'ఎంసీఏ' చిత్రం కూడా 50కోట్ల క్లబ్‌లో చేరింది. నేడు ఆయన నిజంగానే నేచురల్ స్టార్ అయ్యాడు. తన భవిష్యత్తు చిత్రాలను కూడా ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. నిజంగా గతంలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన అనుభవంతోనే ఆయన కథలను, తనకు కరెక్ట్‌గా సూటయ్యే వాటిని ఎంచుకుంటున్నాడా? అనిపించకమానదు. మిగిలిన హీరోలు ఒక్క హిట్‌కే ఆపసోపాలు పడుతూ ఉంటే నేచురల్‌స్టార్ మాత్రం ట్రిపుల్ హ్యాట్రిక్‌పై కన్నేశాడు.
ఇక ఆయన తాజాగా మాట్లాడుతూ.. నా మొదటి చిత్రమే బాపు గారి వద్ద 'రాధాగోపాళం' చేశాను. అప్పటికీ నాకేమీ తెలియదు. కానీ అంతటి మహానుబాహుడి వద్ద పనిచేయడం వల్ల ఎన్నో నేర్చుకోగలిగాను. ఇక 'రాధాగోపాళం'లో స్నేహగారు నటించారు. ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా స్నేహ తల్లిగారు నన్ను చూసినప్పుడలా ఈ కుర్రాడు హీరో అవుతాడని చెబుతూ ఉండేది. ఆవిడేదో సరదాకి అంటున్నారని భావించే వాడిని. కానీ నేడు నిజంగానే నేను హీరోగా ఎదగడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. స్నేహ తల్లి అలా అనేటప్పుడు తథాస్తు దేవతలు దీవించడమో.. లేక ఆవిడ నోటి వాక్కో గానీ మొత్తానికి నానీ మాత్రం తనకు తిరుగేలేదని నిరూపించుకుంటున్నాడు.