ఓల్డ్ ఎవర్‌గ్రీన్ హిట్స్‌కి రీమేక్‌లు, సీక్వెల్స్ చేయడమే కాదు.. ఆయా టైటిల్స్‌ని కూడా ఏమైనా టచ్ చేస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఇక నేటి రోజుల్లో సినిమాలో కంటెంట్, ప్రమోషన్స్, కాస్టింగ్, దర్శకుడు, నిర్మాణ సంస్థ అనేవి ఎంత ముఖ్యమో మొదట ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించడంలో టైటిల్స్ ఎంపిక కూడా ఎంతో కీలకంగా మారింది. గతంలో సునీల్ నటించిన చిత్రాలకు కనీసం మొదటి వారంలో సినిమా ఎలా ఉన్నా కాస్తైనా ఓపెనింగ్స్ వచ్చాయంటే ఆయా సినిమాల టైటిల్సే కారణం. చివరకు 'జక్కన్న' అనే టైటిల్ కూడా ఆ చిత్రానికి కాస్త ఓపెనింగ్స్‌ని తెచ్చింది.
కానీ తాజాగా ఆయన నటించి, ఎన్‌కౌంటర్ శంకర్ నిర్మాత దర్శకునిగా తీసిన '2 కంట్రీస్'కి ఓ మోస్తరు కలెక్షన్లు కూడా రాకపోవడానికి ఆ టైటిలే కారణం. మలయాళ టైటిల్‌ని యాజీటీజ్‌గా దించకుండా కాస్త మన నేటివిటీ, సునీల్‌ని ఇష్టపడే మాస్ ఆడియన్స్‌కి దగ్గరగా ఉండే టైటిల్‌ని పెట్టి ఉంటే పరిస్థితి కాస్తైనా ఆశాజనకంగా ఉండేది. ఇక పాత క్లాసిక్ చిత్రాల టైటిల్స్ అయిన 'శంకరాభరణం, ప్రేమాభిషేకం, భూకైలాస్' వంటి చిత్రాలు దారణమైన ఫలితాలను అందుకున్నాయి. అందులో కాస్త 'మల్లీశ్వరి', జంధ్యాల 'జయంబు నిశ్చయంబురా', 'గీతాంజలి' మాత్రమే ఫర్వాలేదనిపించాయి.
ఇక రానా తాజాగా నటించే చిత్రం కోసం చాంబర్‌లో 'అడవిరాముడు' అనే టైటిల్‌ని రిజిష్టర్ చేశారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో జంతువులు, ఏనుగులు పట్టే వాడి కథతో ఇది రూపొందనుందని సమాచారం. ఇక నేటి తెలుగు చిత్రాల కమర్షియల్ పంధాని ఒక్క మలుపు తిప్పి, కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన చిత్రం ఎన్టీఆర్ - రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన 'అడవి రాముడు' చిత్రమే. ఇక ఇదే టైటిల్‌తో 'అడవిరాముడు'గా ప్రభాస్ మరో చిత్రంలో నటించాడు. సినిమా నిర్మాణదశలోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ చిత్రం విడుదలకు అడ్డంకులు ఎదుర్కొని పలువురు నిర్మాతల చేతులుమారి రిలీజై ఫ్లాప్ అయింది. అలా నేటి 'బాహుబలి' నటించిన 'అడవిరాముడు' ఫ్లాప్ అయిన నేపధ్యంలో భళ్లాలదేవుడు 'అడవిరాముడు'గా ఎంత వరకు ఆకట్టుకుంటాడో వేచిచూడాల్సివుంది..!