తాజాగా సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన రాజకీయ రంగప్రవేశాన్ని ఖరారు చేశాడు. ఎప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా తాము తమిళనాడులోని 234 స్థానాలలో పోటీచేస్తామని తెలిపాడు. ఇక యుద్దం చేస్తాను.. గెలుపు ఓటములు దేవుడి నిర్ణయం. యుద్దం చేయకపోతే పిరికివాడు అంటారని రజనీ వ్యాఖ్యానించారు. రజనీ ధైర్యంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అమితాబ్ నుంచి కమల్‌హాసన్ వరకు అందరూ స్వాగతిస్తున్నారు. రజనీ సాధారణంగా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోడు. ప్రతి దానిలో నిదానమే పాటిస్తాడు. దానిని కొందరు ఆయన చేతకాని వాడని, పిరికిపంద అని, నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తిగా, డేర్‌గా డెసిషన్స్ తీసుకోలేని వాడిగా భావిస్తారు.
కానీ రజనీ తాను నమ్మింది.. దేవుడు శాసించిందే చేస్తాడు. ఒక్కసారి అడుగు వేస్తే మాత్రం జయమైనా, అపజయమైనా లెక్క చేయడు. ఇక ఇప్పుడు రజనీ అదే పని చేయడంతో తమిళనాట అందరు హర్షం ప్రకటిస్తున్నారు. దీనిపై తాజాగా సినీ విమర్శకుడు కత్తి మహేష్ కామెంట్స్ చేశాడు. పనిలో పనిగా పవన్‌పై కూడా వ్యంగ్యమైన ట్వీట్ చేశాడు.
'పార్టీ పెట్టి కూడా పోటీ చేయకుండా ఇంట్లో కూర్చున వారిని పిరికిపంద అంటారని రజిని అంటే.., అరె మా రాష్ట్రంలో పవన్ అంటారే..' అంటూ స్పందించాడు. నిజమే పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయని వాడు నిజంగా పిరికిపందే. ఇటీవల పవన్‌ని ఉద్దేశించి ఓ నెటిజన్ చాలా మంచి వ్యాఖ్యలు చేశాడు. ప్రశ్నించడం రాజకీయాలలో ముఖ్యం కాదు.. పోరాడటం, ఉద్యమం చేయడం ముఖ్యం. పోరాటం చేయకుండా ప్రశ్నిస్తే విలువ లేదు. ప్రశ్నించడానికి పవన్ ఒక్కడే కాదు.. ఎందరో ఉన్నారు. రోజుకి వేయి ప్రశ్నలు సంధించేవారు. వేల ట్వీట్‌లు పెట్టడం ఎవరికైనా చేతనైన పనే. కాబట్టి పవన్ ఇకనైనా పోరాడితే పోయేదేముంది..బానిస సంకెళ్లు తప్ప.. అని తెలుసుకోవాల్సివుంది...!