తాజాగా తలైవా రజనీకాంత్ రాబోయే ఎన్నికల్లోపు పార్టీని స్థాపించి, తమిళనాడులోని అన్ని స్థానాలకు పోటీ చేస్తానని చెప్పాడు. దీనిపై అమితాబ్ స్పందిస్తూ....రజనీ అద్భుతమైన వ్యక్తి, ఆయన నా సహచరుడు. ఆప్తుడు. ఆయన రాజకీయాలలోకి వస్తున్నానని ప్రకటించాడు. అతను రాజకీయాలలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపాడు. ప్రముఖ నటి ఖుష్భూ స్పందిస్తూ, ప్రజాస్వామ్యం, అభివృద్దిపై రజనీకి ఉన్న కమిట్‌మెంట్ అందరికీ తెలిసిందే. ఆయనకు వాటిపై నమ్మకం ఉంది. ఆయన బాగా రాణిస్తాడని తెలిపింది. సినీ రంగంలోనే కాదు.. రాజకీయాలలో కూడా మీరు అద్భుతంగా రాణిస్తారని నా నమ్మకం. తమిళ ప్రజలకు సేవ చేసే కొత్త నేత అవతరించాడు అంటూ ప్రసన్న, తమిళ ప్రజలు రాజకీయాలలో రజనీ వెంటే ఉంటారని, రాజకీయాలలో ఆయనకు తిరుగేలేదని దర్శకుడు లింగుస్వామి ఆకాక్షించారు.
ఈ సందర్భంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తలైవా రాజకీయరంగ ప్రవేశంపై స్పందించాడు. తలైనా రాజకీయాలలోకి రావడం 'ఈవెంట్ ఆఫ్ ది సెంచరీ'. ఆయన పొలిటిక్స్‌లోకి రావడం ఈ శతాబ్దపు అత్యున్నత ఘటన, ఇక రజనీ రాజకీయాలలోకి వస్తున్నానని ప్రకటించినప్పుడు ఆయనలో స్క్రీన్‌పై కనిపించే సూపర్‌స్టార్ కంటే వెయ్యిరెట్లు ప్రభావవంతంగా కనిపించాడు. ఆయన అన్ని స్థానాలకు పోటీ చేస్తానని ప్రకటించడం ఆయనకున్న ఆత్మవిశ్వాసానికి, ధైర్యానికి ప్రతీక, పీకే (పవన్‌కళ్యాణ్) కూడా తలైవా మాటలను స్ఫూర్తిగా తీసుకుని అన్ని స్థానాలలో పోటీ చేస్తే పీకేదే విజయం అని వర్మ చెప్పారు.
ఈ మాట వాస్తవం. ఎవరో మోచేతి నీళ్లు తాగుతూ, టిడిపికో, బిజెపికో సపోర్ట్ చేసి ఇప్పటికే ఆయన కాస్త పరువు పొగొట్టుకున్నాడు. విజయమో వీరస్వర్గమో అన్నట్లు దేవుడిపై భారం ఉంచి వచ్చే ఎన్నికల్లో అయినా జయాపజయాల విషయం పక్కనపెట్టి సొంతంగా పవన్ అన్ని స్థానాలలో పోటీ చేస్తేనే ఆయన టిడిపి తొత్తు అనే ముద్రపోయి, రాజకీయంగా ఎప్పటికైనా ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనేది నిజం.