ప్రస్తుతం కేంద్రప్రభుత్వం స్వచ్చభారత్‌ని ఉద్యమంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంని స్వచ్చ సర్వేక్షన్‌లో నెంబర్‌వన్ స్థానంలో నిలబెట్టాలని సీనియర్ కమెడియన్ అలీ పిలుపునిచ్చారు. ఆయన రాజమహేంద్రవరంలో మాట్లాడుతూ, మనం స్వచ్చంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. తద్వారా స్వచ్చభారత్, స్వచ్చ రాజమహేంద్రవరం సాధ్యమవుతాయి. విదేశాలలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేస్తే శిక్షిస్తారు. మనం కూడా పొడి చెత్తను, తడి చెత్తను వేర్వేరుగా ఉంచి, పారిశుద్ద్య కార్మికులకు ఇవ్వాలి.
ఇక హెల్మెట్ లేకుండా బైక్‌లు నడపకూడదు. తల్లిదండ్రులు పిల్లలను చదివించాలి. అయితే మోటార్ బైక్‌లు కొనిచ్చి ప్రమాదాలకు కారణం కానివ్వకండి. ప్రాణం పోవడానికి క్షణం చాలు. తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని తల్లిదండ్రులే తమ పిల్లలకు చెప్పాలి. పిల్లలకు తల్లిదండ్రులు హైస్పీడ్ స్పోర్ట్స్ బైక్‌లు కొనివ్వడం మంచిది కాదు.. అని చెప్పుకొచ్చాడు.
ఇక తాజాగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు యునిసెఫ్ ప్రతినిధిగా ఎంపికైన త్రిష తానే ఇటుకలు పేరుస్తూ మరుగుదొడ్డిని నిర్మిస్తున్న ఫొటో సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇలాంటి సెలబ్రిటీలు చెబితే అయినా వారి మాటలకు ప్రజలు స్పందించే అవకాశం ఉంది. తద్వారా వారి అభిమానులు, ప్రేక్షకులే కాదు సాధారణ పౌరులు కూడా వాటి ద్వారా స్ఫూర్తి పొందుతారని చెప్పవచ్చు.