ప్రస్తుతం అందరి చూపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'అజ్ఞాతవాసి'పైనే ఉంది. ఇది పవన్‌కి ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రం కావడం, పవన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడం, ఇక ఇప్పటికే ఆడియో, టీజర్‌లకు వచ్చిన రెస్పాన్స్‌ని చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. ఓవర్‌సీస్‌లో కూడా పవన్‌కి, త్రివిక్రమ్‌కి ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. వీరి చిత్రాలు ఫ్లాపయినా అక్కడ కలెక్షన్లు అదిరిపోతాయి. ఇక ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే కామన్ రేటుగా 200 రూపాయలకు టిక్కెట్లను అమ్మాలని భావిస్తున్నారు.
ఓ వైపు పవన్‌కి ఏపీలో ఉన్న పలుకుబడి, దిల్‌రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణలో ఆయనకున్న పరపతి వల్ల ఇలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుండగా, ఒక రోజు ముందే అంటే జనవరి 9వ తేదీనే యూఎస్‌లో ప్రీమియర్ షోలు వేయనున్నారు. దీంతో పవన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకుని యూఎస్‌లోని ఓ ఈవెంట్ సంస్థ 'అజ్ఞాతవాసి' టిక్కెట్లను ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించింది.
డిసెంబర్ 31 రాత్రి 7గంటల నుంచి 1వ తేదీ తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఈవెంట్ సంస్థ 'జల్సా 2018' పేరుతో ఓ ఈవెంట్‌ని నిర్వహిస్తోంది. దీనికి బ్యాచ్‌లర్స్‌కి, ఫ్యామిలీలకి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కి హాజరయ్యే ఫ్యామిలీ టిక్కెట్లను 145 డాలర్లకు విక్రయిస్తున్నారు. ఈ ఈవెంట్‌కి వచ్చే వారికి ఉచితంగా 'అజ్ఞాతవాసి' టిక్కెట్లను ఇవ్వనున్నట్లు ప్రచారం చేయడం ద్వారా 145 డాలర్లతో జాక్‌పాట్‌గా భారీ మొత్తం కొల్లగొట్టాలని ఈ ఈవెంట్ సంస్థ నిర్ణయించింది.