తమిళంలో సీనియర్ మాస్ హీరోగా, స్టార్‌గా పేరున్న నటుడు శరత్‌కుమార్. ఈయన రాధిక భర్త కూడా. ఇక ఆయన మొదట్లో తమిళ సినిమాలలో చేయాలని ఇండస్ట్రీకి వచ్చాడు. నాడు చెన్నైలోనే తెలుగు పరిశ్రమ కూడా ఉండటంతో మొదట ఆయనకు తెలుగు సినిమాలోనే అవకాశాలు వచ్చాయి. ఆయన నటించిన మొదటి చిత్రం 'సమాజంలో స్త్రీ'. దీనికి నిర్మాత శరత్‌కుమార్ స్నేహితుడే. దాంతో ఓ ఆర్టిస్ట్ సమయానికి రాకపోవడంతో ఆ పాత్రను శరత్‌కుమార్‌కి ఇచ్చారు. ఇక ఈ చిత్రంలో సుమన్, భానుచందర్, విజయశాంతి, రావుగోపాలరావు, గొల్లపూడి మారుతిరావు వంటి వారు నటించారు. ఈ చిత్రం గురించి శరత్‌కుమార్ చెబుతూ, ఆ చిత్రంలో ఓ ట్రాలీ షాట్ ఉంది. నేను విజయశాంతి వద్దకు వెళ్లి పెద్ద డైలాగ్ చెప్పాలి.
అప్పటికి నాకు అసలు తెలుగు రాదు. దాంతో ఏడెనిమిది టేకులు తీసుకున్నాను. దీంతో విజయశాంతికి కోపం వచ్చింది. ఎవరిని పడితే వారిని క్యారెక్టర్స్‌కి పెడుతున్నారు. చేయడం చేతకాదు. నాకు ఫ్లైట్‌కి టైమవుతోందని తిట్టారు. ఆ తర్వాత నేను చిరంజీవి, విజయశాంతి, నిరోషా నటించగా, యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్'లో మెయిన్ విలన్‌గా నటించాను. అప్పుడు విజయశాంతి నన్ను గుర్తుపట్టలేదు. దాంతో నేనే వెళ్లి నేను నా మొదటి చిత్రం మీతోనే చేశాను. నాడు మీరు నన్ను తిట్టారు అని చెప్పాను. వెంటనే ఆమె నవ్వుతూ సారీ అని చెప్పింది. ఇక 'కాంచన' చిత్రంలో నేను చేసిన హిజ్రా పాత్ర నాకెంతో పేరు తెచ్చింది. నాకు పాత్ర నచ్చితే ఏదైనా చేస్తాను. హిజ్రా పాత్రలో నటిస్తే దాని ఎఫెక్ట్ తదుపరి చిత్రాలపై కూడా పడుతుందని ఆలోచించను.
అందునా హిజ్రాల పట్ల సమాజం ఎలా ఉండాలి? అనే మెసేజ్ ఆ పాత్రలో ఉంది. దాంతో లారెన్స్ వచ్చి నేనే ఆ పాత్రను చేయాలి అని అడిగాడు. నేను ఒక్కటే చెప్పాను. ఈ చిత్రంలో నేను కనిపించే మొదటి సీన్‌లో ఆడియన్స్ నవ్వుకున్నారంటే ఈ చిత్రం ఫ్లాపయినట్లేనని చెప్పాను, కానీ లారెన్స్ మాత్రం మీలాంటి స్టార్ చెబితేనే ఈ మెసేజ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాడు. ఆ పాత్ర నాకెంతో తృప్తినే కాదు.. మంచి పేరును కూడా తెచ్చింది.. అని చెప్పుకొచ్చాడు.