ఇంతకు ముందు సినిమా ఆడియో ఫంక్షన్స్ ప్రతి చిత్రానికి పెద్ద ప్రమోషన్‌గా ఉండేవి. నాడు టీజర్లు, ట్రైలర్స్ కూడా ఉండేవి కావు. ఫస్ట్‌లుక్‌ని, టైటిల్‌ని ప్రకటిస్తూ వచ్చేవారు. కానీ అల్లు అరవింద్ మాత్రం తెలుగులో ఫస్ట్‌లుక్, టీజర్‌ల తర్వాత ఆడియోలోని పాటలను ఒక్కోటొక్కటిగా సోషల్‌మీడియాలో విడుదల చేస్తూ, ఆడియో ఫంక్షన్స్‌తో పాటు కొత్తగా ప్రీరిలీజ్ ఫంక్షన్స్ అనే కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టాడు. దాంతో చాలా మంది ఆడియో ఫంక్షన్స్ చేయకపోయినా, చేసినా కూడా సినిమా విడుదలకు నాలుగైదు రోజుల ముందు ప్రీరిలీజ్ ఈవెంట్స్ ఖచ్చితంగా చేస్తున్నారు.
ఇక పూరీ జగన్నాథ్ బాలకృష్ణ హీరోగా తీసిన 'పైసా వసూల్' చిత్రం కోసం ఇటు టీజర్ కన్నా ఎక్కువ, మరోవైపు ట్రైలర్ కన్నా తక్కువ అన్నరీతిలో స్టంపర్ అంటూ ఓ టీజర్ వంటి దాన్ని విడుదల చేశాడు. ఇప్పుడు అల్లుఅర్జున్ మరోసారి మరో కొత్త ప్రయోగంతో మన ముందుకు వస్తున్నాడు. అల్లుఅర్జున్ ప్రస్తుతం రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' చిత్రం చేస్తున్నాడు. ఇటీవలే ఇందులోని భారీ యాక్షన్ సీన్స్‌ని కూడా చిత్రీకరించారు. ఈ చిత్రం ఏప్రిల్ చివరి వారంలో విడుదల కానుంది. అంటే ఈ చిత్రం రిలీజ్‌కి ఎంతో సమయం ఉంది. ఇక సినిమా ప్రారంభంలోనే టైటిల్ ప్రకటించారు. మరి జనవరి 1న ఈ టీం ఏం విడుదల చేస్తుంది? అనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.
తాజాగా జనవరి1న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ ఇంపాక్ట్ రానుందని యూనిట్ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. దీంతో అందరు ఫస్ట్ ఇంపాక్ట్ అంటే ఏమిటి? అనే ఆలోచనలో పడ్డారు. చివరకు ఫస్ట్ ఇంపాక్ట్ అంటే ట్రైలర్ కంటే తక్కువ స్థాయిలో కేవలం 80సెకన్ల పాటు అల్లుఅర్జున్ లుక్‌ని చూపిస్తూ ఎలాంటి డైలాగ్స్ ఉండని టీజర్ తరహాలో ఉంటుందని తెలుస్తోంది. అంటే ఇది ఫస్ట్‌లుక్ కన్నా ఎక్కువ.. ట్రైలర్ కన్నా తక్కువ అన్నమాట. 'పైసా వసూల్' ఫ్లాప్ అయ్యేసరికి స్టంపర్ అనే పదం ఎవరికి నచ్చలేదు. మరి 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'తో మొదలు కానున్న ఈ ఫస్ట్ ఇంపాక్ట్ అనేది ఈ సినిమా సక్సెస్ అయితే అది కూడా ఇక నుంచి ఓ ఆనవాయితీగా మారడం ఖాయమనే చెప్పవచ్చు.