సంగీత దర్శకునిగా, సింగర్‌గా, నటునిగా, దర్శకునిగా ఇలా పలు అవతారాలలో కనిపించే ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్. ఆయన మొదటి చిత్రం 'నీకోసం'. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన మొదటి చిత్రం అది. రవితేజకి హీరోగా కూడా అది మొదటి చిత్రం. ఇక ఈ చిత్రంలో చాన్స్ గురించి ఆర్పీ మాట్లాడుతూ.. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ క్లాస్‌మేట్స్‌మి. నేను మొదట 'ఆనందం' అనే ప్రైవేట్ ఆల్బమ్ చేశాను. దానికి లిరిక్ రైటర్ కూడా త్రివిక్రమే. ఇక 'నీకోసం' చిత్రంలో అవకాశం కోసం నేను పెద్దగా కష్టపడలేదు. నేను చంద్రసిద్దార్ద్ చిత్రం చేశాను. అది సగంలో ఆగిపోయింది. ఆ సినిమా పాటల రికార్డింగ్ కూడా పూర్తయింది. అంతలో 'నీ కోసం' చిత్రం ఆర్దిక ఇబ్బందుల్లో పడింది. అప్పటికే ఆ చిత్రం కోసం దేవిశ్రీప్రసాద్ 'కొంటె బాపు' అనే పాటను రికార్డ్ చేశారు. మిగిలిన పాటల కోసం నిర్మాతలు చెన్నై వెళ్లలేని పరిస్థితి.
ఆ సమయంలో చంద్రసిద్దార్ధ్ నేను ఆయన చిత్రం కోసం చేసిన పాటలను 'నీకోసం' నిర్మాతలకు వినిపించాడు. వారికి ఆ పాటలు నచ్చి అందులోని రెండు పాటలను వాడుకున్నారు. మిగిలిన పాటలను కూడా నాతోనే చేయించారు. ఇక నాకు త్రివిక్రమ్ ఎందుకు చాన్స్ ఇవ్వలేదు అనేది నాకు తెలియదు. ఆయన మొదటి చిత్రం 'నువ్వే..నువ్వే' చిత్రం స్రవంతి బేనర్‌లో రూపొందింది. ఈ బేనర్ అంటే కోటి సంగీతం అందించేవాడు. ఇక ఆ తర్వాత కూడా ఏదైనా ప్రాజెక్ట్‌కి ఆర్పీ వందశాతం న్యాయం చేస్తాడని భావిస్తే త్రివిక్రమ్ గారే నన్ను పిలుస్తారు కదా..! నేను కేవలం 99శాతం అవుట్‌పుట్ మాత్రమే ఇవ్వగలనని, వేరే వారైతే 100శాతం బెటర్‌గా చేయగలరని భావించినప్పుడు త్రివిక్రమ్ 100శాతం బాగా పనిచేసే వారినే పెట్టుకోవడంలో తప్పులేదు. ఆ విషయంలో నేను ఆబ్లిగేషన్ కాకూడదు. నేను ఆయన్ను అడగకూడదు.
ఇక నేను సంగీత దర్శకుడిని కావాలని నేను పీజీలో ఉండగా నిర్ణయించుకున్నాను. చిన్ననాటి నుంచి ఇళయరాజా, ఆర్‌డి బర్మన్‌ల పాటలు వింటూ పెరిగాను. 'శంకరాభరణం' చిత్రాన్ని 50, 60 సార్లు చూశాను. అందులోని పాటలను బాగా పాడేవాడిని. దాంతో అందరూ నన్ను 'శంకరశాస్త్రి' అని పిలిచేవారు. ఇక బాలు గారి పాటలంటే నాకెంతో ఇష్టం. నేను గాయకునిగా మారడానికి బాలు గారే స్ఫూర్తి..అని చెప్పుకొచ్చాడు.