తాజాగా పెందుర్తిలో ఓ దళిత మహిళపై టిడిపి నాయకులుగా చెప్పబడుతున్న నిందుతులు చేసినది దుర్మార్గపు చర్య. ఇలాంటివి కేవలం టిడిపి సర్కార్‌లోనే లేక ఏదో పార్టీ హయాంలో మాత్రమే జరుగుతున్న సంఘటనలు కావు. నిర్భయ నుంచి ఆయేషా మీరా కేసు వరకు, ఈ పెందుర్తి దళిత మహిళపై జరిగిన పాశవిక ఘటనను ఖండించి, నిజమైన దోషులకు కఠిన శిక్షలు అమలు చేసి అలాంటివి మరలా జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. కేవలం నిర్భయ ఘటనో, లేక ఏదో యాసిడ్ దాడి జరిగినప్పుడే వాటి గురించి ఆందోళనలు చేయడం, రాజకీయంగా వాడుకోవాలని చూడటం కన్నా నికృష్టం మరొకటి ఉండదు. తోటి మహిళగా రోజా వంటి ప్రజాప్రతినిధులు కలిసి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి గానీ దానిని రాజకీయం చేసి, లబ్దిపొందాలనుకోవడం తప్పు.
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అధికార మదంతో ఇలాంటి పనులు చేస్తున్న వారికి బుద్దిచెప్పడం ఎలా అనే దాని మీదనే చర్చ జరగాలి. కానీ ఈ ఘటనను వైసీపీ పార్టీ పూర్తిగా రాజకీయం చేస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరిన పవన్‌ని కూడా ఇలా రొచ్చులోకి లాగడం సమంజసం కాదు. ఇవి వ్యక్తిగత దాడులుగా కనిపిస్తాయి గానీ వీటికి పలు సామాజిక రుగ్మతలే కారణం. ఎవరో విదేశాలలో ఉన్న మహిళ చెబితే స్పందించానని పవన్ చెప్పాడని, ఇక్కడ పుట్టిన తోటి ఆడపడుచుపై ఇలాంటి ఘటన జరిగినా తెలుసుకోలేని పవన్‌ది మూర్ఖత్వం అని, ఆ మహిళపై పోరాటం చేస్తోన్న వైసీపీకి రాజకీయ లబ్ది చేకూరకుండా ఉండేందుకే పవన్ దీనిపై స్పందించాడని రోజా విమర్శలు చేయడం దురదృష్టకరం. రేపు వైసీపీ అధికారంలోకి వస్తే ఇలాంటి సంఘటన ఒక్కటి కూడా జరగకుండా చూసుకుంటామని జగన్, రోజాలు ప్రజల ముందు ప్రతిజ్ఞ చేయగలరా?
ఆయేషా మీరా హత్య, రేప్ కేసులో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కోనేరు రంగారావు మనవడైన కోనేరు సతీష్ ప్రమేయం ఉన్నప్పటికీ ఆ కేసును పక్కదోవ పట్టించి స్వయాన ఆయేషామీరా తల్లి కూడా నిర్దోషి అని చెప్పిన ఓ అమాయకమైన యువకుడి మీదకి కేసును నెట్టి వేసి అతనిని సుదీర్ఘకాలం జైలులో ఉంచి, చివరకు నిర్దోషిగా విడుదలైన తర్వాత నంగనాచి కబుర్లు చెప్పిన జగన్, ఇతర వైసీపీ నాయకుల వంటి వారి పరిస్థితి ఏమిటి? అనేది రోజా సమాధానం చెప్పాలి. దీనిని కూడా రాజకీయం చేస్తూనే మరోవైపు వైసీపీకి లబ్ది చేకూరకుండా పవన్ ట్వీట్స్ చేస్తున్నాడని వాదించడం ఎంత దిగజారుడు తనమో కాస్తైనా ఆలోచించాలి రోజా గారూ...!