ఫాదర్ పేరు చెప్పుకునే వారు..గాడ్‌ఫాదర్ పేరు చెప్పుకుని బతికేవారు నిజమైన గొప్పవ్యక్తులు కాలేరని మన పెద్దలు చెబుతుంటారు. 'మా నాన్నలు, తాతలు నేతులు తాగారు... మా మూతి వాసన చూడండి'.. అనే సామెత కూడా దాని నుంచే పుట్టుకొచ్చింది. ఇక ఎవరు ఏమిటి? అనేది బయటి వ్యక్తులు చెప్పుకోవాలే గానీ ఎవరి డప్పు వారు వాయించుకున్నా, లేదా ఆ కుటుంబంలోని వారు వారిని వారు భజన చేసుకున్నా ఆ పొగడ్తల ద్వారా ఒరిగేది ఏమీ ఉండదు. మెగా హీరోల వేడుకల్లో మెగాఫ్యామిలీకి చెందిన వారు చిరంజీవి, పవన్‌లను కీర్తించినా, లేక తమ వేడుకల్లో బాలకృష్ణ వంటి వారు తమంతట తాము తమ తండ్రి గురించి, చరిత్ర గురించి వారికి వారే.. లేదా వారి సన్నిహితులు పొగొడుకుంటే వినడానికి ఒకటి రెండు సార్లు బాగానే ఉంటుంది కానీ అది ఎవరి భుజాలు వారు తట్టుకున్నట్లుగానే ఉంటుంది.
'జై సింహా' ఆడియో వేడుకలో బాలయ్య ప్రసంగం కూడా అదే తరహాలో కనిపిస్తోంది. మా తండ్రిగారు ఎన్నో గొప్పగొప్ప వేషాలు వేశారు. ఆ ఘనత ఆయనకే దక్కుతుంది.అలాంటి వేషాలలో నటించే గుణం నాకే అబ్బింది. 'జై సింహా' యూనిట్ ఓ ఎన్‌సైక్లోపీడియా అని బాలయ్య చెప్పుకొచ్చాడు. అయితే తన నటన, తన చిత్రాల గురించి మాట్లాడాల్సింది.. నిర్ణయించాల్సింది, న్యాయం చేశానా? లేదా? అని చెప్పాల్సింది అభిమానులేనన్న మాట మాత్రం బాగుంది. అయితే స్టార్స్ చిత్రాలను , వాటి గొప్పతనం గురించి అభిమానులు చెప్పుకోవడం ముఖ్యం కాదు. సామాన్య ప్రేక్షకులు, తటస్తు ప్రేక్షకులు, విమర్శకులు చెబితేనే దానికి అందం అనేది వస్తుందని బాలయ్య మరిచాడు.
నేడు అందరు స్టార్స్ కేవలం తమ అభిమానులను అలరించడానికే ప్రయత్నిస్తున్నారు కాబట్టి నేటి చిత్రాలు పాత ఎన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలాగా మాస్టర్ పీస్‌లుగా నిలవలేకపోతున్నాయి. స్టార్స్ కేవలం తమ అభిమానులనే మెప్పించే పాత్రలు కాకుండా అందరినీ రంజింపజేసే ప్రయత్నాలు చేస్తే తప్ప మంచి చిత్రాలు లేవు. కానీ మన స్టార్స్ ఇతర ప్రేక్షకుల అభిరుచులను పట్టించుకోకుండా కేవలం ఫ్యాన్స్‌ని బట్టి సినిమాలు తీయడం ఇండస్ట్రీకి మంచిది కాదనే చెప్పాలి.