మారుతి దర్శకత్వంలో నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో నాని హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ సినిమాలో మతిమరుపు లక్కీ గా నటించి అందరిని నేచురల్ గా ఆకట్టుకున్నాడు. అప్పటికే నేచురల్ స్టార్ గా మారిన నాని ఆ సినిమా దగ్గర నుండి ఆ బిరుదుకి పక్కాగా సూట్ అయ్యాడంటూ అందరూ నేచురల్ స్టార్ నాని అంటూ హోరెత్తించారు. అయితే ఆ సినిమా తర్వాత చేసిన కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్మన్, మజ్ను, నేను లోకల్, నిన్నుకోరి, ఇప్పుడు తాజాగా ఎంసీఏ. ఈ సినిమాలన్నిటిలో నాని చాలా చక్కగా నేచురల్ గా నటించాడు. కానీ నాని ఒకేలా రొటీన్ గా నటిస్తున్నాడనే టాక్ మిడిల్ క్లాస్ అబ్బాయితో బయటికి వచ్చింది.
నాని నుండి వచ్చే సినిమాలన్నీ కామెడీతో ఎమోషనల్ గా ఉన్న సినిమాలే ఉంటున్నాయనే ఫీలింగ్ ఎంసీఏ సినిమాతో బాగా వచ్చేసింది ప్రేక్షకులకు. అందుకే నానికి నేచురల్ స్టార్ ని వదిలేసి రొటీన్ స్టార్ అని పెట్టుకుంటే బావుంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎక్కడ తన సినిమాలు ప్లాప్ అవుతాయో అని భయపడిన నాని ఇలా రొటీన్ కథలకే ఓటు వేస్తున్నాడని... అలాగే కొత్తగా ఆలోచించడానికి కూడా అస్సలు ట్రై చెయ్యడం లేదంటున్నారు. అందుకే ఇప్పుడు ఎంసీఏ సినిమా పక్కా రొటీన్ కథతోనే వచ్చి ప్రేక్షకులకు కొంచెం బోర్ కొట్టించాడని టాక్ రావడమే కాదు.... క్రిటిక్స్ నుండి కూడా నాని నటన రొటీన్ అనే కామెంట్స్ పడ్డాయి.
అయినా తన సినిమా హిట్ అనే మూడ్ లోనే ఉన్నాడు నాని. నాని అనడం కాదుగాని..... ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకాదరణ పొందిన నాని ఎంసీఏ సినిమా బాగుందనే విషయం ఎంసీఏ కలెక్షన్స్ ఓపెన్ గానే చెబుతున్నాయి. మరి నాని ఈ కామెంట్స్ ని దృష్టిలో ఉంచుకుని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్న కృష్ణార్జున యుద్దాన్ని అయినా కాస్త డిఫరెంట్ గా చేస్తే బావుంటుందంటున్నారు. మరి నాని ఒకవేళ ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే... ఫ్యూచర్ లో ఇబ్బందులు తప్పవంటున్నారు. చూద్దాం కృష్ణార్జునలో నాని ఎలా కనబడతాడో.