సాధారణంగా మన టాలీవుడ్ స్టార్స్ అంగ వైకల్యం ఉన్న పాత్రలను చేయరు. కానీ బాలీవుడ్, కోలీవుడ్‌లో మాత్రం స్టార్స్ సైతం ఆ తరహా పాత్రలను చేస్తూ ఉంటారు. తాము నటించే చిత్రంలో తాము ఏ అంగవైకల్యంతో బాధపడుతున్నామో... ఆయా దివ్యాంగులను వారు కలిసి తమ సినిమా ప్రమోషన్స్‌కి బాగానే వాడుకుంటారు. ఇక ఇటీవల రవితేజ 'రాజా ది గ్రేట్' చిత్రంలో మామూలు మాస్ అంశాలనే చూపిస్తూ అంధునిగా నటించాడు. ఈ చిత్రం విడుదలకు ముందు వీరు ఓ అంధుల పాఠశాలకువెళ్లి అక్కడి వారితో ముచ్చటించి వారితో ఫొటోలు దిగి హంగామా చేశారు.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం రామ్‌చరణ్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఆయన గ్రామీణ యువకునిగా గుబురు గడ్డంతో చిట్టిబాబుగా కనిపించనున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలై మంచి స్పందనను రాబట్టింది. ఇక ఈ చిత్రంలో రామ్‌చరణ్ చెవిటి వాడిగా, సమంత పక్కా పల్లెటూరి యువతిగా మూగ దానిలా నటిస్తోందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. దానికి బలం చేకూర్చే సంఘటన తాజాగా జరిగింది. రామ్‌చరణ్ -ఉపాసన దంపతులు హైదరాబాద్‌లోని ఆశ్రయ ఆకృతి పాఠశాలలో బధిరులతో చాలా సేపు గడిపి వారితో ముచ్చటించి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా వారు బధిరులతో ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఉపాసన ఓ ట్వీట్‌తో పాటు ఓ ఫొటోని పోస్ట్ చేసింది. 'ఆశ్రయ ఆకృతి పాఠశాల పిల్లల ప్రేమాభిమానాలకు లొంగిపోయాం. మిస్టిర్‌సి ఆ బధిర విద్యార్దులతో ఎందుకంత అటాచ్‌మెంట్‌తో ఉన్నాడనే సంగతి త్వరలోనే మీకు తెలుస్తుంది'.. అని తెలిపిన ఉపాసన మేర్రీ కిస్మస్, హ్యాపీ హాలీడేస్ అని తెలుపుతూ, అక్కడి చిన్నారులతో కలిసి కేక్ మిక్సింగ్‌లో కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఉపాసన వ్యాఖ్యలు గమనిస్తుంటే 'రంగస్థలం 1985'లో రామ్‌చరణ్ బధిరునిగా కనిపించనున్నాడనే వార్తకి బలం చేకూరుతోందనే చెప్పవచ్చు.