సినిమా వారైనంతమాత్రాన వారికి ఎమోషన్స్, భయం వంటివి ఉండవా? అంటే ఉంటాయి. అప్పుడెప్పుడో నెల్లూరుజిల్లాలోని వెంకటగిరి ప్రాంతంలో సినీ తారలు పయనిస్తున్న ఫ్టైట్ ప్రమాదానికి లోనైంది. పైలట్ చాకచక్యంగా దానిని పొలాలలో ల్యాండ్ చేశాడు. దానిలో చిరంజీవి, అల్లురామలింగయ్య, రామానాయుడు వంటి అనేక మంది ప్రముఖులు ఉన్నారు. క్షణాలలో అది కూలిపోతుందని తెలిసి ప్రాణాలు పోతాయేమో అన్న భయంతో కాస్త ఉద్వేగం చెందడం, కన్నీరు పెట్టుకోవడం, అయినా వారిని తలుచుకుని బాధపడటం కామనే. ఆ సంఘటన సందర్భంగా అక్కడి పొలాలలో పనిచేసే వారి మాటల్లో చెప్పాలంటే.. ఈ జెట్ సేఫ్‌గా పొలాలలో ల్యాండ్ అయిన తర్వాత చిరంజీవి కూడా ఉద్వేగం తట్టుకోలేక అల్లురామలింగయ్యని హత్తుకుని ఏడ్చేశాడు. కానీ చిరంజీవి ఏంటి? అంతటి స్టార్ ఏడవడం ఏమిటి? అని నాడు మెగాభిమానులు మండిపడ్డారు. దాంతో చిరంజీవి కూడా తాను ఎంతో గుండె నిబ్బరంతో ఉన్నానని, ఏడ్చిన మాట వాస్తవం కాదని వాదించాడు.
మరీ ఓ స్టార్ ఏడవకూడదా? నిజజీవితంలో కూడా ఉద్వేగానికి లోనైనా, దానిని కప్పి పుచ్చుకునే పని ఎందుకు చేయాలి? అనేది ప్రశ్నార్ధకం. ఇక తాజాగా 'హలో' ప్రీరిలీజ్ ఈవెంట్‌కి నాగార్జున, అఖిల్, నాగచైతన్య, సమంతలతో పాటు చిరంజీవి, రామ్‌చరణ్‌లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, సమంత వచ్చిన తర్వాత తమ ఇళ్లంతా కళకళగా ఉందని, నాగచైతన్యకి ఉన్న మంచి మనసు తనకే కాదు ఎవ్వరికీ ఉండదని చెప్పాడు. ఆ మాటలకు వేదికపై ఉన్న వారే కాదు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా సమంత కళ్లలో నీళ్లు తిరిగాయి. దాంతో నాగచైతన్య వంటి భర్త, అక్కినేని ఫ్యామిలీ అంతటికి కోడలు అయినందుకు సమంత ఆనందభాష్పాలు రాల్చిందని అందరూ ఎమోషనల్ అయ్యారు. కానీ దీనిపై సమంత వేరేలా స్పందించింది.
ఆ సందర్భంగా తానేమీ ఏడవలేదని, తన కళ్లకు ఇన్‌ఫెక్షన్ వచ్చిన కారణంగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయని చెప్పింది. అయినా అలా ఉద్వేగంతో కన్నీరు పెట్టుకుంటే తప్పేమిటి? తన భర్త, మామ, మరిది ఉన్న వేడుకలో అఖిల్ చిత్రం విజయవంతం కావాలని ఉద్వేగం చెందడంలో తప్పేమి లేదు. అది ఆమె గొప్ప మనసుకి ఉదాహరణగానే నిలుస్తుంది గానీ అందులో పోయే పరువేమి లేదని చెప్పాలి. ఇక ఈ వేడుకకు సమంత అక్కినేని ఫ్యామిలీ కోడలి హోదాలో, మరిది వేడుకకు ఎంతో హుందాగా, పూర్తిగా ఒంటిని కవర్ చేసే దుస్తులతో నిండుగా రావడం అభినందనీయం.