మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరీర్‌లో 'మాస్టార్' చిత్రంలో టైటిల్ సాంగ్‌ని, 'మృగరాజు' చిత్రంలో 'చాయ్' పాటలను పాడాడు. కానీ ఎందుకనో ఆయన స్యయంగా పాడిన పాటలు ఆ చిత్రాలకే ఏమాత్రం హెల్ప్ కాలేకపోయాయి. దాంతో చిరు దానిని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. కానీ నేడు సంగీతం, పాటలు పాడటంలో కూడా విప్లవాత్మకమైన సాంకేతిక పురోగతి వచ్చింది. దాంతో నేటి స్టార్స్‌లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరి చేత ఆ చిత్రాల సంగీత దర్శకులు పాటలు పాడిస్తున్నారు. పాట ఎలా పాడినా కూడా దానిని వినసొంపుగా వినిపించే అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడం కూడా దానికి ప్రధాన కారణంగా చెప్పాలి. బహుశా చిరంజీవి రోజుల్లో అలాంటి సాంకేతిక నైపుణ్యం లేకపోవడం కూడా దీనికి ఓ కారణంగా చెప్పాలి.
ఇక పవన్‌కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన గొంతులో సమ్‌థింగ్ స్పెషల్ అనే మ్యాజిక్ ఏదో ఉంది. ముఖ్యంగా జానపద గీతాలను ఆయన పాడిన పాటలు చిన్న చిన్న బిట్స్‌గా ఎన్నో చిత్రాలలో వినిపించాయి. దాంతో ఆయనకున్న వ్యక్తిగత మక్కువ ఉన్న ఫోక్‌సాంగ్స్‌ని ఆయన చిత్రాలకు మరో స్పెషల్ అట్రాక్షన్‌ని చేసేందుకు సంగీత దర్శకులు, దర్శకనిర్మాతలు తాపత్రయపడుతున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనే పవన్ పాడిన 'అత్తారింటికిదారేది' చిత్రంలోని 'కాటమరాయుడా.. కదిరి నరసింహుడు' పాట ఆ చిత్రానికి పెద్దప్లస్ పాయింట్ అయింది. అదే 'కాటమరాయుడు'ను కమెడియన్ సప్తగిరి తన చిత్రానికి టైటిల్‌గా పెట్టుకోవడం, ఆ తర్వాత పవన్ కోరికను మన్నించి 'కాటమరాయుడు' టైటిల్‌ని పవన్ చిత్రానికే ఇచ్చి వేసిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా 'అజ్ఞాతవాసి'లో కూడా పవన్ ఓ పాట పాడనున్నాడని, 'కొడుకా.. కోటేశ్వరరావు' అని ఈ పాట సాగుతుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు పవన్ ఈ చిత్రంలోని తన పాటను ప్రస్తావించకపోయినా కూడా తాను ఇందులో ఓ పాట పాడానని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇప్పుడే 'అజ్ఞాతవాసి'కి సంబంధించిన ఓ పాటను పాడటం పూర్తి చేశానని చెప్పిన ఆయన ఓ ఫోటోను కూడా సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ, సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్, పాటల రచయిత భాస్కరభట్ల ఉన్నారు. ఇక భాస్కరభట్లకు స్పెషల్ సాంగ్స్ రాయడంలో ఎంతో మంచి గుర్తింపే ఉంది. ఇక అనిరుధ్ విషయానికి వస్తే ఈయన 'కొలవరి' ద్వారా ధనుష్ చేత పాట పాడించి, దేశ విదేశాలలో మారు మోగిపోయేలా చేశాడు. మరి 'కాటమరాయుడా'ని పాడించిన దేవిశ్రీ కంటే మిన్నగా అనిరుద్ ఈ పాటను పవన్ చేత ఎలా పాడించాడు? అనేది ఆసక్తికరంగా మారింది.