మన తెలుగులో కొందరు స్టార్స్ ఉన్నారు. వీరు మాతృభాష తెలుగైనా సరే ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే ఎక్కువగా ఇంగ్లీషు పదాలనే వాడుతుంటారు. విక్టరీ వెంకటేష్ నుంచి నేటి యంగ్‌స్టార్స్ వరకు ఈ బాపత్తు వారు ఎందరో ఉన్నారు. తమ చిత్రాలకు ఇంగ్లీషు టైటిల్స్, పాటల్లో 'లెట్స్‌డు కుమ్ముడు' వంటి పదాలతో కాలం గడిపేస్తూ ఉంటారు. ఇక అల్లుఅర్జున్ కూడా ఓసారి తాను పెద్దగా తెలుగు సినిమాలు చూడనని, హాలీవుడ్ మూవీస్ అంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. అలాంటి బన్నీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ఎంతో ఘనంగా జరపడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.
ఆయన ట్వీట్ చేస్తూ... తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా నిర్వహించింది. తెలుగు సాహిత్యం, సంస్కృతిని చాటిచెప్పేలా, భావితరాలకు స్పూర్తినిచ్చేలా ఈ మహాసభలను జరపడం అత్యద్భుతం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంతో అభినందిస్తున్నానని తెలిపాడు. ఇక ఈయన ప్రస్తుతం రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే చిత్రం చేస్తున్నాడు. దేశభక్తి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనుండగా, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
మరోవైపు తమకు సొంతగా మూడు నాలుగు బేనర్లు ఉన్నప్పటికీ బన్నీ ప్రస్తుతం తన అభిరుచికి తగ్గ చిత్రాలు చేసేందుకు తన పిల్లల పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్‌ని స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడట. ఇక మంచు మనోజ్‌తో 'మిస్టర్ నూకయ్య' చిత్రం దర్శకుడు బాక్సింగ్ నేపధ్యంలో ఓ కథను బన్నీకి చెప్పాడని, ఈ కథ బన్నీకి బాగా నచ్చడంతో ఆయన ఇదే కథను కొత్త దర్శకునితో గానీ లేదా విఐ ఆనంద్‌తో గానీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.