నేడు రచయితలుగా పరుచూరి బ్రదర్స్ హవా పెద్దగా లేదు గానీ దాదాపు మూడు దశాబ్దాల పాటు వారు ఇండస్ట్రీని శాసించారు. ప్రతి అగ్రనటుడితో వారు కలిసి పనిచేశారు. కొందరు హీరోలైతే పరుచూరి బ్రదర్స్ ఒప్పుకుంటేనే సినిమాలకు డేట్స్ ఇస్తామని చెప్పేవారు. నాటి ఎన్టీఆర్, ఏయన్నార్‌ల నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు వారు అందరితో పనిచేశారు. కథారచయితలుగా, సంభాషణల రచయితలుగా వారు తమకు తిరుగేలేదని నిరూపించుకున్నారు. ఇక వీరు ఎన్టీఆర్, కృష్ణ వంటి వారికి ఎన్నో హిట్స్ ఇచ్చారు. మనిషిని నమ్ముకుంటే నోట్లో మట్టికొడతాడని, భూమిని నమ్ముకుంటే నోటికి అన్నం ఇస్తుందనే వంటి అద్భుతమైన డైలాగ్స్ రాశారు. వారు నిజజీవితంలో కూడా మనషులతోపాటు భూమిని నమ్ముకున్నారు.
దాని గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. నాకు మా గెస్ట్ హౌస్ చూసినంతనే శోభన్‌బాబుగారు గుర్తుకు వస్తారు. ఆయన ఓ రూపాయి సంపాదిస్తే మరో రూపాయి అయినా అప్పుచేసి స్థలం మీద పెట్టుబడులు పెట్టండి అని అందరికీ సలహాలు ఇచ్చేవారు. ఆయన దోవలోనే పయనించిన మురళీమోహన్, చంద్రమోహన్, శ్రీధర్ వంటివారు తమ సంపాదనను భూములపై వెచ్చించారు. మేము కూడా శోభన్‌బాబు మాటలు విని ఓ స్థలం కొని అందులో గెస్ట్ హౌస్ కట్టుకున్నాం. అందుకే మాకు మా గెస్ట్ హౌస్ చూసినప్పుడల్లా శోభన్‌బాబుగారే గుర్తుకు వస్తారని చెప్పారు.
ఇక చాలామంది పాతకాలం నటీనటులు సంపాదించినదంతా ఇతర వ్యాపారాలలో పెట్టుబడి పెట్టి నష్టపోయి పదిపైసలు కూడా చేతిలో లేక జీవితపు చివరిరోజుల్లో ఎంతో దయనీయంగా మరణించారు. దాంతో శోభన్‌బాబు చెప్పిన సూత్రం నచ్చి ఎందరో తమ డబ్బులపై పెట్టి, స్థలాల విలువను పెంచుకుని నేడు కోటీశ్వరులయ్యారు. ఇక దానధర్మాలు, ఇతర విషయాలలో డేరింగ్ అండ్ డాషింగ్ అనే విధంగా ఎలా ఉండాలో కృష్ణని చూసి నేర్చుకుంటే.. శోభన్‌బాబుని చూసి భూములపై తమ పెట్టుబడిని పెట్టాలని అందరూ స్ఫూర్తిగా తీసుకున్నారు.