ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అచ్చమైన తెలుగువారి పంచెకట్టులో స్టార్‌హీరో, ఏపీ ఎమ్మేల్యే నందమూరి బాలకృష్ణ హాజరై మంచి ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్.టి.ఆర్. అనే మూడు అక్షరాలు వింటే తన రక్తం ఉప్పోంగుతుందని, తెలుగు అనే మూడు అక్షరాలు వింటే తన తనువు పులకిస్తుందని చెప్పారు. పూజ్య బాపూజీ 'మాతృభాష తల్లి పాలవంటిది' అని చెప్పారని, కానీ మనకు డబ్బా పాలే రుచిగా అనిపిస్తున్నాయని, అమ్మని మమ్మీ అని, నాన్నను డాడీ అని పిలిపించుకుంటున్నామని, ఇలాగే కొనసాగితే కొంతకాలానికి మమ్మీ, డాడీలే నిజమైన తెలుగు పదాలుగా మారిపోతాయని చెప్పారు.
ఇక తెలుగు భాషలో ఎంతో కమ్మదనం, తియ్యదనం ఉన్నాయని తెలుగు భాషలో గోదావరి ఒంపులు, కృష్ణవేణి సొంపులు, నెల్లూరు నెరజాణతనం, రాయలసీమ రాజసం, తెలంగాణ మాగాణం ఉన్నాయని, కోనసీమలోని లేత కొబ్బరి నీరు వంటివి తెలుగు భాష. అటువంటి భాషని మనం మాట్లాడుకుంటున్నందుకు మనం గర్వపడాలి. అటు వంటి జాతిలో మనం పుట్టినందుకు ఎంతో సంతోషించాలి. మన జాతిని, మన భాషని మనం గౌరవించాలి. తెలుగువారందరిని ఒకచోటికి చేర్చిన సీఎం కేసీఆర్ సహృదయత, భాషాభిమానానికి యావత్ తెలంగాణ, ఆంధ్రా ప్రజల తరపున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని బాలయ్య ప్రసంగించారు.
ఇక ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన మోహన్‌బాబు, కేటీఆర్‌ని సభా పూర్వకంగా సన్మానించగా, ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో తెలుగు భాషని తప్పనిసరి చేయడంపై పలువురు కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.