హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సందర్భంగా తెలుగు చలన చిత్ర ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించి తెలంగాణ ప్రభుత్వం తరపున వారికి సన్మానం చేశారు. అయితే ఈ సన్మానం చేయడం, చేయించుకోవడం అనే విషయాలను పక్కనపెడితే అసలు తెలుగుభాషాభివృద్దికి మన తెలుగు సినీ పెద్దలు ఏమాత్రం కృషి చేస్తున్నారు? అనేది అవలోకనం చేసుకోవడం ముఖ్యం. తెలుగువారిగా పుట్టిన మనం, మన తెలుగు పరిశ్రమలో నాడు ఎన్టీఆర్, ఏయన్నార్, కె.విశ్వనాథ్, బాపు, దాసరి వంటి వారు అచ్చమైన తెలుగు భాషని, మన సంస్కృతి, సంప్రదాయాలను వారు వైభవంగా చాటారు. కానీ నేడు మాత్రం కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్, శేఖర్‌కమ్ముల వంటి ఇద్దరు ముగ్గురు మాత్రమే ఆ కోవలోకి వస్తున్నారు. తెలుగు సినిమా ద్వారా తెలుగు భాషా ఔన్నత్యాన్ని చాటే తరం దాసరి, విశ్వనాథ్, బాపులతోనే అంతరించి పోయిందని చెప్పినా అతిశయోక్తి కాదు. ఇక రచయితలలో కూడా వేటూరి, సిరివెన్నెల వంటి వారి తర్వాత ఆ దిశగా మరెవ్వరు కనపడటం లేదు. చివరకు సినిమా టైటిల్స్ నుంచి పాటలలో కూడా ఆంగ్లపదాలను ఇరికిస్తూ దానినే మనం ఏదో గొప్పగా సామాన్యులను సైతం కట్టి పడివేసే సులభ పదజాలంగా మన జబ్బలు మనం చరుకుకుంటున్నాం.
'రోబో' అనే పదానికి తమిళులు 'యంతిరన్' అనే పదాన్ని కనిపెడితే తర్వాత మాత్రమే మనకి కూడా యంత్రుడు అనే పదాన్ని రోబోకి ప్రత్యామ్నయంగా తీసుకున్నాం. ఇక ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, తనని ఈ వేడుకకి పిలవడానికి కేటీఆర్ తన ఇంటికి వచ్చిన సందర్భంగా జరిగిన సంభాషణను తెలిపారు. తనను కేటీఆర్ ఈ సభలకు పిలవడానికి వచ్చినప్పుడు ఆయనకు 'అవార్డు' వచ్చిన సందర్భంగా తాను ఇంగ్లీషులో శుభాకాంక్షలు తెలిపానని, దానికి కేటీఆర్ అన్నా.. స్వచ్చమైన తెలుగు కార్యక్రమానికి పిలిచేందుకు వచ్చాను. మనం స్వచ్చమైన తెలుగు వాళ్లం.. తెలుగులోనే మాట్లాడుకుంటే బాగుంటుంది కదా..! అన్నారు. దానికి నాకు మనసు చివుక్కుమంది. తెలుగు వాళ్లం కలిసినప్పుడు ఇంగ్లీషులో మాట్లాడుకోవడం ఎందుకు అనిపించింది. ఆ వెంటనే కేసీఆర్‌కి 'సారీ' చెప్పేశాను. దానికి కేటీఆర్ 'లేదన్నా..జస్ట్ జోకింగ్' అన్నారు. ఆయన తమాషాగా అన్నా కూడా నాలో ఆ భావన కలిగిందని.. చెప్పాడు.
అయితే ఈ మాటల్లో కూడా 'అవార్డు' వచ్చినందుకు, 'సారీ' చెప్పాను అని చిరంజీవి చెప్పడం కేటీఆర్ 'జస్ట్ జోకింగ్'.. 'హ్యాట్సాఫ్' వంటి పదాలకు తెలుగులో ప్రత్యామ్నయాలు లేవా? సారీ అంటే ప్రతి చిన్న విషయానికి 'సారీ' చెప్పే బదులు 'క్షమాపణ' అని వాడవచ్చు కదా...! అనిపించడం సహజం.