కళాతపస్వి కె.విశ్వనాథ్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఆయన తెలుగు సినిమాకు, తెలుగు భాషకి చేసిన సేవలు నిరుపమానం. ఆయనకు ఇటీవలే దాదా సాహెబ్‌ఫాల్కే అవార్డు వచ్చింది. ఆయనకు ఇప్పుడు అవార్డులు వన్నె తేవడం అనే స్థాయి నుంచి ఎంతో ఎదిగిన ఆయన అవార్డులకే వన్నె తెచ్చేస్థాయికి ఎదిగారు. తాజాగా ఆయనకు విజయవాడలో సన్మానం చేసిన రోటరీ క్లబ్ నిర్వాహకులు ఆయనకు జీవిత సాఫల్య అవార్డును అందించారు. రోటరీ క్లబ్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకల సందర్భంగా విశ్వనాథ్‌కి 2016-17కి గాను ఈ అవార్డును అందించారు.
మరోవైపు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆయనకు ఈ నెల 29న మరో పురస్కారం అందించనున్నారు. కె.విశ్వనాథ్‌కి 'పద్మమోహన కంకణం' ప్రధానం చేయనున్నట్లు పద్మమోహన ఆర్ట్స్ సంస్థ ప్రకటించింది. తమ సంస్థ 27వ వార్షికోత్సవాల సందర్భంగా విశ్వనాథ్‌కి ఈ పురస్కారం అందించనుంది. ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, సిరివెన్నెల సీతారామశాస్త్రితో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమం ముందు కె.విశ్వనాథ్ చిత్రాలలోని మధురమైన గీతాలతో సంగీత విభావరిని కూడా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. నిజానికి కె.విశ్వనాథ్ గొప్పతనం ముందు ఇవి చంద్రునికో నూలు పోగు వంటివేనని చెప్పాలి. ఆయన విశిష్టత ముందు ఏ అవార్డు అయినా సరితూగలేదని చెప్పవచ్చు.