తెలుగులో బాలనటిగా ఎన్నో చిత్రాలలో నటించింది మీనా. ఇక 1980-90లలో ఆమె రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి స్టార్స్ అందరి సరసన హీరోయిన్‌గా మెప్పించింది. ఇక ఆమె తెలుగులో నటించిన 'సీతారామయ్యగారి మనవరాలు, చంటి' చిత్రాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మీనా ఏదైనా చిత్రంలో నటిస్తోంది అంటే ఆమె పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది అని ప్రేక్షకులు భావించేవారు. ఇక ఈమె నటించిన 'సుందరకాండ'తో పాటు పలు చిత్రాలలో ఎమోషన్స్, గ్లామర్, కామెడీ.. ఇలా ఏ పాత్రనైనా తనదైనశైలిలో మెప్పించి టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది. కాగా మీనాకి ఒక కోరిక ఉందిట. ఈ విషయాన్ని స్వయంగా మీనానే చెప్పుకొచ్చింది.
సాధారణంగా తాము చేయలేని పనిని కనీసం తమ సంతానమైనా చేసి తమ కోర్కెలను తీర్చాలని తల్లిదండ్రులు ఆశలు పెట్టుకుంటారు. ఇప్పుడు మీనా కోరికను ఆమె కుమార్తె బేబి నైనిక తీర్చిందట. ఇక విషయానికి వస్తే మీనాకి స్టార్ హీరో విజయ్, దర్శకుడు సిద్దిఖీ అంటే వీరాభిమానం. ఇక సిద్దిఖీ దర్శకత్వం వహించిన విజయ్ చిత్రం 'ప్రెండ్స్'లో హీరోయిన్ అవకాశం మీనాకి వచ్చిందట. కానీ ఆ సమయానికి ఆమెకు డేట్స్ ప్రాబ్లమ్ రావడంతో ఆమె ఆ చిత్రంలో నటించలేకపోయింది. ఇక మీనా కుమార్తె బేబి నైనిక విజయ్ హీరోగా నటించిన 'తేరీ' చిత్రంలో నటించి, మంచి ప్రశంసలు అందుకుంది.
ఇక ఈ పాప ప్రస్తుతం సిద్దిఖీ దర్శకత్వంలో రూపొందుతున్న 'భాస్కర్ ఒరు రాస్కెల్' లో తన రెండో చిత్రంగా నటిస్తోంది. ఈ చిత్రంలో అరవింద్‌స్వామి, అమలాపాల్‌లు నటిస్తున్నారు. ఇలా తన కుమార్తె తన మొదటి చిత్రం విజయ్‌తో, రెండో చిత్రం దర్శకుడు సిద్దిఖీతో పనిచేయడం చూస్తే తనకు ఎంతో ఆనందంగా ఉందని, తన కోరికను తన కుమార్తె నెరవేర్చిందని మీనా సంతోషంతో ఉప్పొంగిపోతోంది.