కొందరు మనకి తెలిసి కేవలం ఒకే ఫీల్డ్‌కి చెందిన వారు అని అనుకుంటాం. కానీ వారిలో ఇతర ప్రతిభలు కూడా దాగి ఉంటాయి. సింగింగ్, మ్యూజిక్ కంపోజింగ్, శాస్త్రీయ నృత్యాలు, దర్శకత్వం.. ఇలా మనకి తెలియని ప్రతిభలెన్నో వారిలో దాగి ఉంటాయి. నాడు వ్యాంప్‌క్యారెక్టర్లు చేసిన 'శంకరాభరణం' మంజుభార్గవి, జ్యోతిలక్ష్మి, జయమాలిని వంటి ఎందరో శాస్త్రీయనృత్యంలో నిష్ణాతులు. కానీ వారు కేవలం వ్యాంప్ తరహా పాత్రలకే పరిమితమయ్యారు. ఆ తర్వాత వారు తామే స్వయంగా శాస్త్రీయ నృత్య కళాశాలను స్థాపించి ఎందరో వర్దమాన యువతీయువకులకు అందులో తర్ఫీదునిచ్చేవారు. ఇక రేవతి, సుహాసిని, మమతా మోహన్‌దాస్, శృతిహాసన్, ఆండ్రియా వంటి ఎందరో బహుముఖ ప్రజ్ఞాశాలులు ఉన్నారు. అతిలోక సుందరి శ్రీదేవిని అందరూ గొప్ప అందగత్తెగా, హీరోయిన్‌గానే మాత్రమే చూస్తారు. కానీ ఆమె గొప్ప పెయింటర్. ఆమె గీసే చిత్రాలకు ఎంతో డిమాండ్ ఉంది. ఎవరి వేడుకలకైనా, లేదా బర్త్‌డేల కైనా ఆమె స్వయంగా తన కుంచెతో గీసిన పెయింటింగ్స్‌నే గిఫ్ట్‌గా ఇస్తుంది.
ఇక విషయానికి వస్తే బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా అందరికీ పరిచయం. ఆమె తమిళ, తెలుగు ప్రేక్షకులకు కూడా 'లింగా'తో సుపరిచితురాలే. తాజాగా ఆమె తాను ఓ మంచి పెయింటర్‌ని అని చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు నా పుస్తకాల నిండా నేను గీసిన బొమ్మలే ఉండేవి. నేను చిన్నప్పటి నుంచి బొమ్మలు బాగా గీసేదానిని. సంవత్సరం ముందు నుంచి స్కెచ్‌లు, కలర్స్‌తో ప్రయోగాలు మొదలుపెట్టాను. ఆబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ అంటే నాకెంతో ఇష్టం. అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ అంటే ఆకారంతో పని లేకుండా రంగులతో భావవ్యక్తీకరణ చేసే కళ. ఇప్పుడు జంతువులు, మహిళల మొహాలను గీస్తూ ఉన్నాను. నాకు పెయింటింగ్ అంటే మెడిటేషన్‌తో సమానం. నేను గీసిన పెయింట్స్‌ని ఇటీవల బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడే వారి సహాయార్ధం వేలం వేసి, వారికి అందించాను.
రాబోయే రోజుల్లో కూడా నా డ్రాయింగ్స్‌ని స్వచ్చందసంస్థల కోసం వాడుకోదలుచుకున్నాను. ఈ మధ్య నా స్నేహితులకు కూడా నేను గీసిన డ్రాయింగ్సే గిఫ్ట్స్‌గా ఇస్తున్నాను. ఇప్పుడు ఆ విషయం అందరికీ తెలిసిపోయి మాకు కూడా ఓ గిఫ్ట్ ప్లీజ్ అంటున్నారు. వారి కోసమైనా తరచుగా నేను పెయింటింగ్స్ గీయాల్సివస్తోందంటూ తనలోని మరో కళను కూడా బయటపెట్టింది.