నాడు మద్రాస్‌లో సినీ పరిశ్రమ ఉన్నంతకాలం సినిమా తీయడం, అందులోని నటీనటులు ఎలా ఉంటారు? అనే విషయాలన్నీ గుప్పిట్లో రహస్యాలుగా ఉండేవి. నాడు తిరుమల దర్శనానికి వెళ్లిన టూరిస్ట్‌లందరూ మద్రాస్‌కి వెళ్లి ఒక్క నటుడైనా కనిపించకపోతాడా? అని సినిమా వారి ఇళ్ల ముందు క్యూలు కట్టేవారు. గుప్పిట్లో ఉంటేనే దేనికైనా అందం. కానీ హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత సినిమా తీయడం నుంచి నటీనటుల వరకు అంతా ఓపెన్‌సీక్రెట్ అయింది. ఇండస్ట్రీ మద్రాస్‌లో ఉన్న కాలంలో శతదినోత్సవ వేడుకలు కూడా ఇండోర్ ప్రాంతంలోనే జరిగేవి. కానీ నేటి నిర్మాతదర్శకులు మాత్రం తమ సినిమాలకి మంచి ప్రమోషన్ రావడం కోసం, కోట్లలో ఖర్చయ్యే పబ్లిసిటీని ఉచితంగా పొందడం కోసం బహిరంగ ప్రదేశాలలో హైదరాబాద్ అవతల ఊర్లలో కూడా జరుపుతున్నారు.
ఇక సినిమా వారికి ప్రేక్షకులు లేకపోతే ఎంత నష్టమో అందరికీ తెలుసు గానీ ప్రేక్షకులకు మాత్రం సినిమా వారు అంత అవసరం లేదు. వినోద సాధానాలు పెరిగిన సమయంలో ప్రేక్షకులే దర్శకనిర్మాతలకు దేవుళ్లు. ఇక పబ్లిసిటీ కోసం బహిరంగ ప్రదేశాలలో సినీ వేడుకలను నిర్వహిస్తే సహజంగానే ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే సినీ ప్రేక్షకులకు అదొక మధురానుభూతి కావడంతో అత్యుత్సాహం కూడా చూపిస్తారు. కాబట్టి దర్శకనిర్మాతలే ఆడియన్స్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? ఎక్కడ వేడుక జరపాలి? ప్రాణనష్టాలు వంటివి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆయా మేకర్స్, వారి పర్సనల్ సెక్యూరిటీ గార్డులు, పోలీసుల సహాయంతో ప్రేక్షకులను నిలువరించగలగాలి. ఇక తాజాగా నాని-దిల్‌రాజుల 'ఎంసీఏ' వేడుకను వరంగల్‌లో చేశారు. షూటింగ్ కూడా అక్కడే చేయడం, వరంగల్ బ్యాక్‌డ్రాప్ చిత్రం కావడంతో అక్కడే వేడుక నిర్వహించారు. దాంతో జనం బాగా వచ్చారు. పాపం ప్రేక్షకులు పిచ్చి ఆనందంలో కేరింతలు, చప్పట్లు వంటి వాటితో హంగామా చేశారు. దీనికి దిల్‌రాజుకి అసహనం వచ్చింది.
వరంగల్ ప్రజలు ఇలా ప్రవర్తిస్తారని అనుకోలేదని, ఇలాగైతే ఇక వరంగల్‌లో షూటింగ్సే చేయనని వార్నింగ్ ఇచ్చాడు. ఇది ఆయన సొంత తప్పిదం అని తెలిసి కూడా తప్పునంతా వరంగల్ ప్రాంతంలోని ప్రతి ఒక్కరిని ఉద్దేశించేలా బెదిరించే ధోరణితో మాట్లాడటం మాత్రం సమంజసం కాదు. చివరకు హీరో నాని మాత్రమే ఈ విషయంలో కాస్త బాగా స్పందించాడు. వరంగల్‌లో షూటింగ్ చేయం.. అది ఇది అని దిల్‌రాజు మాట్లాడుతుంటాడు. అయినా అంతదూరం నుంచి మేమొచ్చింది మీకు కామ్‌గా ఉంటే చూడటానికా? అని కవరింగ్ ఇచ్చాడు. మొత్తానికి వరంగల్ ప్రజలను ఇంతలా బెదిరించిన దిల్‌రాజు పట్ల వరంగల్ వాసులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సివుంది....!