పవన్ కళ్యాణ్ నుండి సినిమా వస్తుంది అంటేనే పవన్ ఫ్యాన్స్ కి ఆకాశమే హద్దుగా పండగ వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో సినిమా చూసేద్దామా అనే ఆత్రుతతో అటు సోషల్ మీడియాలో ఏ హీరో ఫ్యాన్స్ చెయ్యని హడావిడి చెయ్యడం వారికి అలవాటు. పవన్ గత చిత్రాలు డిజాస్టర్ అయినా కూడా.. ఇప్పుడు అజ్ఞాతవాసి మీద అదిరిపోయే అంచనాలు అటు ఇండస్ట్రీలోను ఇటు ఫ్యాన్స్ లోను ఉన్నాయనడానికి శనివారం వదిలిన టీజరే సాక్ష్యం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా టీజర్ ని అలా యూట్యూబ్ లో వదిలారో లేదో ఇలా రికార్డుల మోత మోగింది.
కేవలం 30 నిమిషాల్లో అజ్ఞాతవాసి టీజర్ మిలియన్ వ్యూస్ మార్కును దాటేయడం ఒక రికార్డనే చెప్పాలి. అలాగే కేవలం ఒక గంటలో వ్యూస్ 2 మిలియన్ మార్కుకు చేరువ అయిపోయాయి. అంతేకాకుండా 80 నిమిషాల్లోనే అజ్ఞాతవాసి టీజర్ లైక్స్ కూడా 2 లక్షలు దాటడం మరో రికార్డ్. అయితే పైన చెప్పినవన్నీ కేవలం తెలుగులో రికార్డులే. యూట్యూబ్ లో శనివారం సాయంత్రం నుంచి అజ్ఞాతవాసి టీజర్ సౌత్ ఇండియాలో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ మిగతా హీరోలకు దడ పుట్టిస్తుంది. అలాగే కేవలం 20 గంటల్లోనే ఈ టీజర్ వ్యూస్ 5.2 మిలియన్లకు చేరుకోవడమే కాదు... లైక్స్ కూడా దాదాపు 4 లక్షలకు చేరువయ్యాయి అంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏమిటో ప్రూవ్ అవుతుంది.
అసలు అజ్ఞాతవాసి టీజర్ రావడానికి ముందే పవన్ ఫ్యాన్స్ యూట్యూబ్ లో అన్ని సినిమాల రికార్డులని బద్దలు కొట్టాలని గట్టిగానే ప్రిపేర్ అయ్యారు. అందుకే సోషల్ మీడియాలో విపరీతమైన షేర్స్, లైక్స్ తో అజ్ఞాతవాసి టీజర్ ని అందనంత ఎత్తులో నిలబెట్టారు. ఇకపోతే విజయ్ మెర్శల్ టీజర్ 24 గంటల వ్యవధిలో 11.2 మిలియన్ వ్యూస్ తో సౌత్ ఇండియాలో నెంబర్ వన్ గా ఉన్నట్లు చెబుతున్నారు. మరి విజయ్ మెర్సల్ ని టచ్ చేయలేకపోయినా అజ్ఞాతవాసి రికార్డ్స్ మాత్రం అదిరిపోయాయనే చెప్పాలి.